ఐఓబీ నష్టం రూ. 516 కోట్లు

6 Feb, 2015 00:24 IST|Sakshi
ఐఓబీ నష్టం రూ. 516 కోట్లు

- అధిక కేటాయింపులే కారణం    
- ఈ సీజన్‌లో తొలి నష్టం ఈ బ్యాంకుదే

న్యూఢిల్లీ: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐఓబీ)కు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలానికి రూ.516 కోట్ల నష్టం వచ్చింది. మొండిబకాయిలకు అధికంగా కేటాయింపులు జరపడం వల్ల ఈ స్థాయి నష్టాలు వచ్చాయని బ్యాంక్ పేర్కొంది. ఇప్పటివరకూ ఆర్థిక ఫలితాలు ప్రకటించిన బ్యాంకుల్లో మొదటిసారిగా నష్టాలు ప్రకటించిన తొలి ప్రభుత్వ రంగ బ్యాంకు ఇదే. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఈ బ్యాంక్ రూ.75 కోట్ల నికర లాభం ఆర్జించింది. కాగా ఆర్థిక ఫలితాలు దారుణంగా ఉండటంతో బ్యాంక్ షేర్ బీఎస్‌ఈలో గురువారం 10 శాతం క్షీణించి రూ.50.5 వద్ద ముగిసింది.
 
గత క్యూ3లో రూ.9,168 కోట్లు(5.27 శాతం)గా ఉన్న స్థూల మొండిబకాయిలు ఈ క్యూ3లో రూ.14,501(8.12 శాతానికి)కు పెరిగాయని ఐఓబీ పేర్కొంది. నికర మొండి బకాయిలు 3.24 శాతం నుంచి 3.52 శాతానికి పెరిగాయని వివరించింది. ఆదాయపు పన్ను కాకుండా మొత్తం కేటాయింపులు రూ.811 కోట్ల నుంచి రూ.1,183 కోట్లకు పెరిగాయని తెలిపింది. నిర్వహణ లాభం రూ.961 కోట్ల నుంచి రూ.726 కోట్లకు తగ్గిందని, అయితే నికర వడ్డీ ఆదాయం రూ.1,344 కోట్ల నుంచి రూ.1,357 కోట్లకు పెరిగిందని పేర్కొంది.  మొత్తం ఆదాయం కూడా  రూ.6,190 కోట్ల నుంచి రూ.6,647 కోట్లకు వృద్ధి చెందిందని వివరించింది. నికర వడ్డీ మార్జిన్ 2.05 శాతంగా ఉందని తెలిపింది.
 
స్వల్పంగా తగ్గిన యూకో లాభం
యూకో బ్యాంక్ ఈ క్యూ3లో రూ.304 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ3 నికర లాభం(రూ.315 కోట్లు)తో పోల్చితే 3.5 శాతం తరుగుదల నమోదైందని బ్యాంక్ పేర్కొంది. మొండిబకాయిలకు అధిక కేటాయింపులే లాభం తగ్గుదలకు కారణమని వివరించింది. గత క్యూ3లో మొండి బకాయిల కేటాయింపులు రూ.812 కోట్ల నుంచి రూ.908 కోట్లకు,  మొత్తం ఆదాయం రూ.4,919 కోట్ల నుంచి రూ.5,447 కోట్లకు పెరిగాయని పేర్కొంది. స్థూల మొండి బకాయిలు 5.2 శాతం నుంచి 6.5 శాతానికి, నికర మొండి బకాయిలు 3.06 శాతం నుంచి 4.25 శాతానికి  పెరిగాయని వివరించింది. ఫలితాల నేపథ్యంలో ఈ బ్యాంక్ షేర్ ధర బీఎస్‌ఈలో 6 శాతం తగ్గి రూ.68 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు