ఐఓసీ షేర్ల బైబ్యాక్‌ @ రూ.4,435 కోట్లు

14 Dec, 2018 03:40 IST|Sakshi

షేర్‌ బైబ్యాక్‌ ధర రూ.149

రూ.6.75 మధ్యంతర డివిడెండ్‌

రికార్డ్‌ డేట్‌ ఈ నెల 25  

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) రూ.4,435 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ చేయనున్నది. అంతేకాకుండా రూ.6,665 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించనున్నది. ఈ షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనను డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదించిందని ఐఓసీ గురువారం తెలిపింది. 3.06 శాతం వాటాకు సమానమైన 29.76 కోట్ల ఈక్విటీ షేర్లను ఒక్కో షేర్‌ను రూ.149 ధరకు బైబ్యాక్‌ చేయనున్నామని పేర్కొంది. ఈ బైబ్యాక్‌ ధర గురువారం ఐఓసీ షేర్‌ ముగింపు ధర (రూ.137) కంటే 9 శాతం అధికం. ఈ కంపెనీలో 54.06 శాతం వాటా ఉన్న కేంద్రం ఈ షేర్ల బైబ్యాక్‌లో పాల్గొని భారీగా నిధులు సమీకరిస్తుందని అంచనా.  

67.5 శాతం మధ్యంతర డివిడెండ్‌
ఒక్కో షేర్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రూ.6.75(67.5 శాతం)మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించడానికి కూడా డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని ఐఓసీ వెల్లడించింది. మొత్తం డివిడెండ్‌ చెల్లింపులు రూ.6,566 కోట్లని(పన్నులు కాకుండా), ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.3,544 కోట్ల డివిడెండ్‌ చెల్లిస్తామని, దీనికి అదనంగా డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ కూడా ప్రభుత్వానికి లభిస్తుందని పేర్కొంది. డివిడెండ్‌ చెల్లింపునకు సంబంధించి రికార్డ్‌ డేట్‌   ఈ నెల 25 అని, ఈనెల 31లోపు  డివిడెండ్‌ మొత్తాన్ని వాటాదారులకు చెల్లిస్తామని వివరించింది. కోల్‌ ఇండియా, భెల్, ఆయిల్‌ ఇండియా  వంటి ప్రభుత్వ రంగ కంపెనీల షేర్ల బైబ్యాక్‌ ద్వారా కనీసం రూ.5,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అరడజను ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు షేర్ల బైబ్యాక్‌ ప్రణాళికలను ప్రకటించాయి. ఎన్‌హెచ్‌పీసీ, భెల్, నాల్కో, ఎన్‌ఎల్‌సీ, కొచ్చిన్‌ షిప్‌యార్డ్, కేఐఓసీఎల్‌ తదితర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి.  

మరిన్ని వార్తలు