భారీ రిఫైనరీ ఏర్పాటుకు సన్నాహాలు

14 Jan, 2016 03:04 IST|Sakshi
భారీ రిఫైనరీ ఏర్పాటుకు సన్నాహాలు

ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ జత!
 న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత భారీ రిఫైనరీని పశ్చిమ తీరప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ ఇందుకోసం చేతులు కలుపుతున్నాయి. ఇండియన్ ఆయిల్ డెరైక్టర్ (రిఫైన రీస్) సంజీవ్ సింగ్ ఈ విషయం తెలిపారు. ఈ రిఫైనరీ వార్షిక సామర్థ్యం 15 మిలియన్ టన్నుల పైగానే ఉంటుందని ఆయన వివరించారు.ప్రభుత్వ రంగ చమురు సంస్థల్లో ఇప్పటిదాకా ఐవోసీ మాత్రమే ఒడిషాలోని పారదీప్‌లో 15 మిలియన్ టన్నుల యూనిట్‌ను ఏర్పాటు చేసింది.

ప్రైవేట్ రంగంలో అతి పెద్ద రిఫైనరీ (27 మిలియన్ టన్నుల) ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఉంది. ప్రతిపాదిత కొత్త రిఫైనరీకి సంబంధించి ప్రతి మిలియన్ టన్నుకు రూ. 2,500 కోట్ల మేర వ్యయం ఉంటుందని సంజీవ్ సింగ్ తెలిపారు. పరిమాణం, పెట్టుబడుల అంశాలపై కసరత్తు జరుగుతున్నట్లువివరించారు. మరోవైపు, 2020 ఏప్రిల్ నాటికి యూరో6 ప్రమాణాలకు అనుగుణంగా ఇంధనాలను ఉత్పత్తి చేసే దిశగా తమ ఆరు రిఫైనరీలను అప్‌గ్రేడ్ చేసేందుకు రూ. 21,000 కోట్లు వెచ్చించనున్నట్లు సింగ్ చెప్పారు. దీంతో పెట్రోల్ ఉత్పత్తి వ్యయం లీటరుకు రూ. 1.40 చొప్పున, డీజిల్ ఉత్పత్తి వ్యయం రూ. 0.63 చొప్పున పెరుగుతుందని అన్నారు.
 

మరిన్ని వార్తలు