ఐవోసీ లాభం 85% అప్‌

26 May, 2017 00:49 IST|Sakshi
ఐవోసీ లాభం 85% అప్‌

క్యూ4లో రూ.3,720 కోట్లు
కలిసొచ్చిన అధిక రిఫైనరీ మార్జిన్లు 
 
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీ ఐవోసీ మార్చి త్రైమాసికానికి సంబంధించి బంపర్‌ ఫలితాలను ప్రకటించింది. అధిక రిఫైనరీ మార్జిన్ల అండతో కంపెనీ లాభం ఏకంగా 85 శాతం పెరిగి రూ.3,720 కోట్లకు చేరుకుంది. షేరు వారీ ఆర్జన రూ.7.85గా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో సంస్థకు వచ్చిన లాభం రూ.2,000 కోట్లే. లాభాల్లో భారీ వృద్ధికి అధిక రిఫైనరీ మార్జిన్లకు తోడు ఇన్వెంటరీ గెయిన్స్‌ కారణమని ఐవోసీ చైర్మన్‌ బి.అశోక్‌ విలేకరులకు తెలిపారు. ఆదాయం 24 శాతం వృద్ధితో రూ.1,22,285 కోట్లుగా నమోదైంది. దేశంలో అతి పెద్ద రిఫైనరీ సంస్థ అయిన ఐవోసీ మార్చి త్రైమాసికంలో 17.1 మెట్రిక్‌ టన్నుల ముడి చమురును శుద్ధి చేసింది. ప్రతీ బ్యారెల్‌ ముడి చమురును ఇంధనంగా మార్చినందుకు 8.95 డాలర్లను ఆర్జించింది.

అంతకుముందు ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఇది కేవలం 3 డాలర్లుగానే ఉండడం గమనార్హం. 2015–16 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఇన్వెంటరీ పరంగా కంపెనీ రూ.3,417 కోట్ల నష్టాలను ఎదుర్కోగా... తాజాగా మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.2,634 కోట్ల ఇన్వెంటరీ లాభాలు మెరుగైన ఫలితాలకు కారణమయ్యాయి. కంపెనీ ముడి చమురును కొనుగోలు చేసి శుద్ధి చేసి విక్రయించే లోపు ధరలు పెరిగితే దాన్ని ఇన్వెంటరీ లాభాలుగా పేర్కొంటారు.

ఒకవేళ ధరలు తగ్గితే నష్టాలు ఎదురవుతాయి. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ స్టాండలోన్‌ లాభం 11,242 కోట్ల నుంచి రూ.19,160 కోట్లకు వృద్ది చెందింది. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక వార్షిక లాభంగా ఐవోసీ చైర్మన్‌ అశోక్‌ పేర్కొన్నారు. ఎగుమతులు సహా 2016–17లో 83.49 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తులను విక్రయించినట్టు చెప్పారు. ఇంధన రిటైలింగ్‌ వ్యాపార విస్తరణ కొనసాగుతుందని అశోక్‌ చెప్పారు. కాగా, షేరు ఒక్కింటికీ రూ.1 తుది డివిడెండ్‌ను బోర్డు సిఫారసు చేసింది.

మరిన్ని వార్తలు