ఐవోఎల్‌- టాటా కన్జూమర్‌.. రికార్డ్స్

8 Jul, 2020 15:25 IST|Sakshi

ఎల్‌అండ్‌టీ ఇన్ఫో సైతం

సరికొత్త గరిష్టాలకు షేర్లు

5 శాతంపైగా హైజంప్

ఆటుపోట్ల మార్కెట్లోనూ హెల్త్‌కేర్ రంగ కంపెనీ ఐవోఎల్‌ కెమికల్స్‌, ఎఫ్‌ఎంసీజీ కంపెనీ టాటా కన్జూమర్‌, సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీగా లాభపడటం ద్వారా చరిత్రాత్మక గరిష్టాలను తాకాయి. వివరాలు చూద్దాం..

ఐవోఎల్‌ కెమికల్స్‌
కంపెనీ బ్యాంక్‌ సౌకర్యాల(రుణ చెల్లింపుల)ను కేర్‌ రేటింగ్స్‌ తాజాగా A-నుంచి Aకు అప్‌గ్రేడ్‌ చేసిన వార్తలతో ఐవోఎల్‌ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఈ షేరు 7 శాతంపైగా దూసుకెళ్లి రూ. 592ను అధిగమించింది. ఇది సరికొత్త గరిష్టంకాగా ప్రస్తుతం 5.3 శాతం ఎగసి రూ. 582 వద్ద ట్రేడవుతోంది. మార్చి 25 నుంచీ ఈ షేరు 302 శాతం ర్యాలీ చేయడం విశేషం!

టాటా కన్జూమర్‌
విదేశీ రీసెర్చ్‌ సంస్థ క్రెడిట్‌ స్వీస్‌ తాజాగా ఔట్‌పెర్ఫార్మ్‌ రేటింగ్‌ను ప్రకటించిన నేపథ్యంలో టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. తొలుత ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 6 శాతంపైగా జంప్‌చేసి రూ. 436ను అధిగమించింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 4.4 శాతం లాభంతో రూ. 431 వద్ద ట్రేడవుతోంది. పటిష్ట ఎఫ్‌ఎంసీజీ బ్రాండ్లకుతోడు బలమైన సీఈవోను కొత్తగా ఎంపిక చేసుకున్న నేపథ్యంలో అత్యుత్తమ రేటింగ్‌ను ప్రకటించనట్లు క్రెడిట్‌ స్వీస్‌ పేర్కొంది.

ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌
ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ కౌంటర్‌కు మరోసారి డిమాండ్‌ నెలకొంది. దీంతో తొలుత ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3 శాతానికిపైగా ఎగసి రూ. 2070ను తాకింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ప్రస్తుతం 2 శాతం లాభంతో రూ. 2048 వద్ద కదులుతోంది. గత ఐదు రోజుల్లో ఈ కౌంటర్‌ 7 శాతం పుంజుకుంది. 

>
మరిన్ని వార్తలు