గట్టెక్కిన ఐవోసీ డిజిన్వెస్ట్‌మెంట్

25 Aug, 2015 01:22 IST|Sakshi
గట్టెక్కిన ఐవోసీ డిజిన్వెస్ట్‌మెంట్

- ఖజానాకు రూ. 9,379 కోట్లు
న్యూఢిల్లీ:
స్టాక్ మార్కెట్ భారీగా పతనమైనప్పటికీ.. సోమవారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) డిజిన్వెస్ట్‌మెంట్ గట్టెక్కగలిగింది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి స్పందన కరువయిన తరుణంలో బీమా దిగ్గజం ఎల్‌ఐసీ తదితర సంస్థాగత ఇన్వెస్టర్లు రంగంలోకి దిగి తోడ్పాటు అందించాయి. దీంతో ఐవోసీలో 10 శాతం వాటాల విక్రయంతో ఖజానాకు సుమారు రూ. 9,379 కోట్లు జమకానున్నాయి. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గంలో 24.28 కోట్ల షేర్లు విక్రయానికి ఉంచగా 28.74 కోట్ల షేర్లకు (దాదాపు 1.18 రెట్లు) బిడ్లు దాఖలయ్యాయి.

వీటి విలువ సుమారు రూ. 11,107 కోట్లు ఉంటుంది. 5 శాతం డిస్కౌంటు ఇచ్చినప్పటికీ రిటైల్ ఇన్వెస్టర్లు కేవలం అయిదో వంతు షేర్లే కొనుగోలు చేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు మాత్రం తమ కోటాకి సంబంధించి 1.43 రెట్లు ఎక్కువ షేర్లకు బిడ్లు వేసారు. 19.42 కోట్ల షేర్లను వారికి ఉద్దేశించగా.. 27.85 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలు చేశారు. మార్కెట్ల పతనానికి అనుగుణంగా ఐవోసీ షేరు ఓఎఫ్‌ఎస్ కనీస ధర రూ. 387 కన్నా తక్కువకి పడిపోయి బీఎస్‌ఈలో రూ. 378.25 వద్ద క్లోజయ్యింది.

>
మరిన్ని వార్తలు