ఐఫోన్ ధరలు పెరిగాయా..?

23 Apr, 2016 17:12 IST|Sakshi
ఐఫోన్ ధరలు పెరిగాయా..?

యాపిల్ ఐఫోన్ కు డిమాండ్ తగ్గి, అమ్మకాలు పడిపోతున్నాయని కంపెనీ నుంచి తీవ్ర ఆందోళనకరమైన వార్తల వచ్చిన క్రమంలో, పాత ఐఫోన్ ధరలు గతవారంలో ఒక్కసారిగా అమాంతం ఎగబాకాయని తెలుస్తోంది. ఐఫోన్ 6 మోడల్ ధర తీసుకుంటే 29శాతం వరకూ రేటు పెరిగిందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. అయితే భారత్ లో ఐఫోన్ ధరలు పెరిగాయనే వార్తల్ని యాపిల్ ఖండించింది. ఆవిష్కరించినప్పుడు ఏ ధరలైతే ఉన్నాయో అంతే ధరకి ప్రస్తుతం పాత ఐఫోన్లు వినియోగదారులకు లభ్యమవుతున్నాయని తెలిపింది. కంపెనీ కొత్తగా ఆవిష్కరించిన ఐఫోన్ ఎస్ఈ కంటే ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్ లవైపు వినియోగదారులు ఎక్కువగా మొగ్గుచూపుతుండటంతో, రిటైలర్లు పాత ఐఫోన్లకు రేట్లు పెంచినట్టు తెలుస్తోంది.

ఐఫోన్లు భారత్ లో ఆవిష్కరణ అనంతరం గరిష్ట చిల్లర ధర(ఎమ్ ఆర్పీ) కంటే చాలా తక్కువగా అమ్ముడుపోయాయి. కానీ ఇప్పడు ధరలు ఎమ్ ఆర్పీ ధరలకు దగ్గరగా నమోదవుతున్నాయి. ఆన్ లైన్లు రిటైలర్లు ఎక్కువగా ఆఫర్ చేస్తున్న డిస్కౌంట్లు తగ్గించాలని ఇటీవల ప్రభుత్వం ఈ-కామర్స్ రంగాన్నికి మార్గదర్శకాలు తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ధరల పెరుగుదలకు యాపిల్ పాత్ర ఏమీ లేకుండానే రేట్లు పెరిగాయని రిపోర్టు తెలిపింది.


ఐఫోన్ ఎస్ఈ 16జీబీ మోడల్ ను రూ.39వేలకు భారత్ లో యాపిల్ ఆవిష్కరించింది. గత వారం వరకూ 16జీబీ ఐపోన్ 6 మోడల్ కనిష్టంగా రూ.31 వేలకు వరకూ, ఐఫోన్ 6ఎస్ రూ. 40 వేల వరకూ అమ్ముడు పోయింది. అయితే ప్రస్తుతం ఐఫోన్ 6 ధర రూ.40వేలకు, ఐఫోన్ 6ఎస్ ధర రూ.48వేలకు ఎగబాకింది. అదేవిధంగా ఐఫోన్ 5ఎస్ ధర కూడా 22శాతం పెరుగుతుందని రిపోర్టు తెలిపింది. ఇప్పటివరకూ ఐఫోన్ ఎస్ఈ అధిక ధర అనే ట్యాగ్ లైన్ తో ఫేమస్ అయింది. కానీ పెరుగుతున్న ధరల ప్రకారం ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్ లు కూడా అదే స్థాయికి చేరుతున్నాయి.       

 

మరిన్ని వార్తలు