-

ఈ నెల 21నుంచి మిధాని ఐపీఓ

15 Mar, 2018 00:40 IST|Sakshi

23న ముగింపు  ధర శ్రేణి రూ.87–90 

రిటైల్‌ ఇన్వెస్టర్లకు రూ.3 డిస్కౌంట్‌

ఇష్యూ రూ.438 కోట్లు  

ముంబై: హైదరాబాద్‌కు చెందిన ప్రత్యేక లోహాలు తయారు చేసే ప్రభుత్వ రంగ మినీ రత్న కంపెనీ, మిశ్రధాతు నిగమ్‌(మిధాని) ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 23న ముగిసే ఈ ఐపీఓ ద్వారా  ప్రభుత్వం  రూ.438 కోట్లు సమీకరిస్తుందని  అంచనా. ఈ ఐపీఓ ప్రైస్‌బాండ్‌ రూ.87–90గా ఉంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు అఫర్‌ ధరలో రూ.3 డిస్కౌంట్‌ లభిస్తుంది. డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియలో భాగంగా ఈ కంపెనీలో 26 శాతం వాటాను ప్రభుత్వం విక్రయిస్తోంది. అందుకని ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులన్నీ ప్రభుత్వ ఖజానాకే వెళతాయని, తమకేమీ రావని మిధాని సీఎమ్‌డీ దినేశ్‌ కుమార్‌ తెలిపారు. ఈ ఐపీఓలో భాగంగా ప్రభుత్వం 26 శాతం వాటాకు సమానమైన 4.87 కోట్ల షేర్లను ఆఫర్‌ చేస్తోంది. ఈ కంపెనీ స్పెషల్‌ స్టీల్, సూపర్‌ అల్లాయ్స్‌ను  తయారు చేస్తోంది. భారత్‌లో  టైటానియమ్‌ అల్లాయ్స్‌ను తయారు చేసే ఏకైక కంపెనీ ఇదే.

ఈ ఐపీఓకు ఎస్‌బీఐ క్యాప్స్, ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌ బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి.   1973లో ఈ కంపెనీ ఏర్పాటైంది. వ్యూహాత్మకంగా ప్రాధాన్యత ఉన్న, దేశ రక్షణకు అవసరమైన క్లిష్టమైన లోహాల, ఉత్పత్తుల తయారీ, సరఫరా, పరిశోధనల్లో స్వావలంబన సాధించే లక్ష్యంగా ఈ కంపెనీని ప్రారంభించారు. ఈ కంపెనీ ఉత్పత్తులను వైమానిక రంగం, విద్యుదుత్పత్తి, అణు, రక్షణ, ఇతర సాధారణ ఇంజనీరింగ్‌ పరిశ్రమల్లో వినియోగిస్తున్నారు. రోహ్‌తక్‌లో ఒక ప్లాంట్‌ను ఈ కంపెనీ ఏర్పాటు చేస్తోంది. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు వద్ద అల్యూమినియమ్‌ లోహాల తయారీ కోసం  నాల్కోతో కలిసి  రూ.3,500 కోట్ల పెట్టుబడులతో ఒక జాయింట్‌ వెంచర్‌ను కూడా ఏర్పాటు చేస్తోంది.   గత ఆర్థిక సంవత్సరంలో మిధాని కంపెనీ రూ.810 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో రూ.27 కోట్ల నికర లాభం సాధించింది. ఈ ఏడాది జనవరి 31 నాటికి కంపెనీ ఆర్డర్‌ బుక్‌ రూ.517 కోట్లుగా ఉంది.  

మరిన్ని వార్తలు