ఐపీవో ప్రణాళికల్లో వెనకడుగు లేదు: వైజాగ్ స్టీల్

17 Oct, 2014 00:42 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల సంభవించిన హుదూద్ తుపాను కారణంగా భారీ నష్టం వాటిల్లినప్పటికీ ఐపీవో ప్రణాళికల్లో వెనకడుగు వేసేదిలేదని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్(ఆర్‌ఐఎన్‌ఎల్-వైజాగ్ స్టీల్) స్పష్టం చేసింది. లిస్టింగ్ వాయిదా కోసం ప్రభుత్వానికి ఎలాంటి  అభ్యర్థనా చేయలేదని తెలిపింది. కంపెనీవైపు నుంచి సమస్యల్లేవని, దీంతో వాయిదాపై డిజిన్వెస్ట్‌మెంట్ శాఖ(డీవోడీ)కు ఎలాంటి వినతినీ అందజేయలేదని వివరించింది.

అయితే ఈ అంశంపై డీవోడీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. ప్రణాళికల ప్రకారం వైజాగ్ స్టీల్ జనవరిలో పబ్లిక్ ఇష్యూ చేపట్టాల్సి ఉంది. కాగా, కంపెనీ ఐపీవో ప్రణాళికలు వివిధ కారణాలవల్ల గతంలో మూడుసార్లు వాయిదా పడటం తెలిసిందే. ఐపీవోలో భాగంగా ప్రభుత్వం 10% వాటాను అమ్మకానికి పెట్టనుంది.  కంపెనీలో వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 2,500 కోట్లవరకు సమీకరించాలని భావిస్తోంది.

2 వారాల్లో పూర్తి ఉత్పత్తి: సీఎండీ
విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగుల భధ్రతకు ఎలాంటి ఢోకా లేదని స్టీల్‌ప్లాంటు సీఎండీ పి.మధుసూదన్ తెలిపారు. గురువారం  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టీల్ సిటీ ఉద్యోగుల భద్రతకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తుపాను ప్రభావంతో  ప్లాంటు భవనాలు, పైకప్పు రేకులు, అద్దాలు ధ్వంసమయ్యాయన్నారు. యంత్రాలకు ముప్పు వాటిల్లలేదన్నారు. ట్రాన్స్‌కో విద్యుత్ సరఫరాను గురువారం సరఫరా పునరుద్ధరించిందన్నారు.  2 వారాల్లో మళ్లీ పూర్తిస్థాయిలో ఉత్పత్తిని అందుకుంటామని చెప్పారు.

మరిన్ని వార్తలు