3 నెలల్లో  భారత్‌లో ఇరాన్‌ బ్యాంక్‌ శాఖ 

9 Jan, 2019 02:03 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇరాన్‌లోని సిస్తాన్‌–బెలూచిస్తాన్‌లో ఉన్న చాబహార్‌ పోర్టు త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాగలదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఇందుకు సంబంధించిన లావాదేవీల నిర్వహణ కోసం ఇరాన్‌కి చెందిన ఒక బ్యాంకు ముంబైలో శాఖను ప్రారంభించనుందని, దీనికి కేంద్రం అనుమతులిచ్చిందని ఆయన చెప్పారు. మూడు నెలల్లో ఇది ప్రారంభమవుతుందన్నారు. ఇరాన్‌ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మొహమ్మద్‌ జావద్‌ జరీఫ్‌తో మంగళవారం సమావేశమైన సందర్భంగా గడ్కరీ ఈ విషయాలు తెలిపారు.

ఇరు దేశాల మధ్య వస్తు మార్పిడి విధానం మొదలైన పలు ప్రతిపాదనలు జరీఫ్‌ ప్రస్తావించినట్లు ఆయన పేర్కొన్నారు. భారత్‌ నుంచి ఉక్కు తీసుకుని, ప్రతిగా యూరియా సరఫరా చేసేందుకు ఇరాన్‌ సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. మరోవైపు, ఇరాన్‌ నుంచి చమురు దిగుమతి చేసుకోవడాన్ని కొనసాగించేలా.. అమెరికా ఆంక్షల నుంచి భారత్‌ మరోసారి మినహాయింపులు పొందగలదని ఆశిస్తున్నట్లు జరీఫ్‌ చెప్పారు.  

మరిన్ని వార్తలు