ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా- సౌత్‌ బ్యాంక్‌.. స్పీడ్‌

9 Jul, 2020 14:43 IST|Sakshi

ట్రాఫిక్‌- టోల్‌ వసూళ్ల అంచనాలు

ఏడాది గరిష్టానికి ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా

క్యూ1 ఫలితాల ఎఫెక్ట్‌

సౌత్‌ బ్యాంక్‌ అప్పర్‌ సర్క్యూట్‌

ఇటీవల తమ ప్రాజెక్టులలో ట్రాఫిక్‌.. కోవిడ్‌కు ముందున్న స్థాయిలో 80 శాతానికి చేరినట్లు మౌలిక సదుపాయాల కంపెనీ ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్స్‌ చైర్మన్‌ డీఎం వీరేంద్ర పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లాక్‌డవున్‌ నిబంధనల్లో వెసులుబాటు కారణంగా ఇకపై టోల్‌ కలెక‌్షన్లు పుంజుకోనున్నట్లు అభిప్రాయపడ్డారు. మొత్తం 9 ప్రాజెక్టులలో 5 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని, వీటిలో 4 ఈ ఏడాదికల్లా పూర్తికాగలవని అంచనా వేస్తున్నారు. తద్వారా టారిఫ్‌లు 45 శాతం పెరిగే వీలున్నట్లు తెలియజేశారు. కంపెనీ గతేడాది(2019-20) ఫలితాలపై వెలువరించిన వార్షిక నివేదికలో ఈ అంశాలను పొందుపరిచినట్లు నిపుణులు తెలియజేశారు. దీంతో రానున్న కాలంలో కంపెనీ పనితీరు మెరుగుపడగలదన్న అంచనాలు పెరిగినట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 9 శాతం జంప్‌చేసింది. రూ. 128ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. గత నెల రోజుల్లో ఈ షేరు 84 శాతం దూసుకెళ్లడం విశేషం! 

సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌
ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో బ్యాంక్‌ స్టాండెలోన్‌ నికర లాభం 11 శాతం వృద్ధితో రూ. 82 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం దాదాపు 5 శాతం పుంజుకుని రూ. 2172 కోట్లకు చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 4.98 శాతం నుంచి 4.93 శాతానికి, నికర ఎన్‌పీఏలు 3.34 శాతం నుంచి 3.09 శాతానికి వెనకడుగు వేశాయి. అయితే ప్రొవిజన్లు, కంటింజెన్సీలు 43 శాతం పెరిగి రూ. 293 కోట్లను తాకాయి. ఈ నేపథ్యంలో సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 8.30 వద్ద ఫ్రీజయ్యింది.

మరిన్ని వార్తలు