ఐఆర్‌సీటీసీ అలర్ట్‌ 

18 May, 2019 08:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  రైల్వే టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) మూతపడనుంది. శనివారం, ఆదివారాల్లో కొంత సమయం పాటు  ఐఆర్‌సీటీసీ సేవలను  నిలిపివేయనున్నారు. మెయింటినెన్స్‌ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని,   వినియోగదారులకు  కలగనున్న ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని  ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ఒక ప్రకటనలో తెలిపింది.  మే 18, 2019  శనివారం,  మే 19 ఆదివారం  మధ్య కొంత సమయం పాటు సేవలు నిలిపివేస్తారు.

ఇ-టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌ ఐఆర్‌సీటీసీ అందించిన సమాచారం ప్రకారం తత్కాల్ సహా రైలు టికెట్ బుకింగ్, టికెట్ల రద్దు తదితర రైలు-సంబంధిత సేవలు ఈ సమయంలో అందుబాటులో ఉండవు. దేశీయంగా శనివారం అర్థరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుఝాము 2.30 గంటల వరకు, ఢిల్లీలో 18వ తేదీ అర్థరాత్రి 23.45 నుంచి 19వ తేదీ ఉదయం 5 గంటలకు ఈ అంతరాయం ఉంటుంది. 

మరింత  సమాచారం కోసం :
కస‍్టమర్‌ కేర్‌  నంబర్లు:  0755-6610661, 0755-4090600, 0755-3934141
మెయిల్‌ ఐడీ: eticket@irctc.co.in   సంప్రదింవచ్చని  ఇ-టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌  ప్రకటించింది.

కాగా రైల్వే టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఐఆర్‌సీటీసీ మే 16, గురువారం ఉదయం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ పని చేయకపోవడంతో ఆందోళన నెలకొంది. మెయింటెనెన్స్ కారణంగా ఇప్పుడు ఈ-టికెటింగ్ సౌకర్యం అందుబాటులో లేదు. దయచేసి కొద్దిసేపటి తర్వాత మళ్లీ ప్రయత్నించండి అన్న మెసేజ్‌తో దర్శనమిచ్చింది. దీంతో సైట్ మెయింటెనెన్స్ విషయాన్ని ముందుగా తెలియజేయ లేదంటూ పలువురు యూజర్లు  సోషల్‌ మీడియా  ద్వారా  ఆగ్రహం వ్యక్తం  చేసిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు