క్లెయిమ్ పరిష్కారం కష్టమేం కాదు!

1 Aug, 2016 01:06 IST|Sakshi
క్లెయిమ్ పరిష్కారం కష్టమేం కాదు!

పాలసీ తీసుకున్నప్పుడే జాగ్రత్త అవసరం
ఆరోగ్య వివరాలేవీ దాచిపెట్టకుంటే ఉత్తమం
చిరునామా, నామినీలు మారితే వెంటనే సవరణ
అన్నీ సరిగా ఉన్నా క్లెయిమ్ కాకుంటే ప్రత్యామ్నాయాలు
అంబుడ్స్‌మన్ నుంచి ఐఆర్‌డీఏకు కూడా...

అసలు బీమా పాలసీ తీసుకునేదే కుటుంబ రక్షణ కోసం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కనుక... ఆపత్కాలంలో ఆదుకుంటుందనే బీమా పాలసీని తీసుకుంటాం. మరి అనుకోని సంఘటన జరిగాక... ఆ దురదృష్టకర పరిస్థితుల్లో పాలసీ అక్కరకు  రాకపోతే..? ఇక్కడ క్లెయిమ్ పరిష్కారం విధాన ప్రక్రియ సులభంగా జరగడం ముఖ్యం. చాలా మంది ఇక్కడే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.   నిజానికి బీమా క్లెయిములంటే.. చాలా కష్టంతో కూడుకున్నవని అనిపించే ఉదంతాలు మనకు తరచూ ఎదురవుతుంటాయి.  గందరగోళాన్ని తొలగించి, క్లెయిమ్ ప్రక్రియపై అవగాహన కల్పించడానికే ఈ కథనం.  క్లెయిమ్ ప్రక్రియ నిజంగానే సులభంగా జరగాలంటే పాలసీదారులు దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..

ముందుగా తీసుకోదల్చుకున్న బీమా పథకం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సందేహాలుంటే ఏజెంటును లేదా బీమా కంపెనీని అడిగి నివృత్తి చేసుకోవాలి. సంతృప్తికరమైన సమాధానాలు పొందాకే సంతకం చేయాలి.

సంతకం చేసే ముందు దరఖాస్తు ఫారాన్ని కూడా చదవాలి. ఖాళీ ఫారంపై సంతకం చేయొద్దు. వివరాలన్నీ మీరే నింపడం మంచిది. ఒకవేళ ఎవరిదైనా సహాయం తీసుకుంటే అన్నీ సరిగ్గా నింపారో లేదో చూసుకోవాలి. ఇంగ్లిషులోని ఫారంను అర్థం చేసుకోవడం కష్టమైతే .. సన్నిహితులో, స్నేహితులో, బంధువులో నమ్మకస్తుల సహాయం తీసుకోవాలి.

మీ వయస్సు, చదువు, ఆదాయం, వృత్తి, అలవాట్లు, కుటుంబ సభ్యుల ఆరోగ్య చరిత్ర, ఇతరత్రా బీమా పాలసీలుంటే ఆ వివరాలు... అన్నీ వాస్తవాలనే తెలపాలి.

సరైన బ్యాంకు అకౌంటు వివరాలు పొందుపరిస్తే, మెచ్యూరిటీ లేదా క్లెయిమ్ మొత్తాలు నేరుగా ఖాతాలోకి డిపాజిట్ అవుతాయి. జీవిత భాగస్వామి, పిల్లలు లేదా తల్లిదండ్రులను నామినీలుగా పెట్టొచ్చు. వారి పేరు, పుట్టిన తేదీ, బంధుత్వం, చిరునామా మొదలైన వివరాలు కచ్చితమైనవిగా ఉండాలి. ఒకవేళ నామినీలు ఒకరికంటే ఎక్కువుంటే.. ఏ నిష్పత్తిలో వాటాలుండాలనేది కూడా పొందుపర్చాలి. బీమా పాలసీ వివరాలను.. నామినీలకు కూడా తెలియపర్చాలి. క్లెయిమ్ సులభ పరిష్కారంలో ఇది ఎంతో కీలకం.

ఇన్సూరెన్స్ కంపెనీ.. మీరు సంతకం చేసిన దరఖాస్తు ఫారం కాపీ, పాలసీ ప్రయోజనాల పత్రాన్ని పంపాలి. బీమా పాలసీ చేతికొచ్చాక మరోసారి వివరాలన్నీ సరిచూసుకోవాలి. తప్పులేమైనా కనిపిస్తే వెంటనే కంపెనీ దృష్టికి తీసుకెళ్లాలి.

పాలసీని సురక్షితమైన ప్రదేశంలో ఉంచి, నామినీకి కూడా తెలియజేయాలి. పాలసీ పత్రాల్లో కంపెనీ కాంటాక్ట్ వివరాలుంటాయి. అవసరమైన సందర్భంలో బీమా సంస్థను వెంటనే ఎలా సంప్రదించాలో నామినీకి చెప్పాలి. అలాగే నామినీకి ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్సు, పాన్ కార్డు వంటి సరైన గుర్తింపు, చిరునామా ధృవీకరణ పత్రాలు, బ్యాంక్ ఖాతా ఉన్నాయో లేదో చూసుకోవాలి. 

చిరునామా లేదా నామినీల వివరాల్లో మార్పులేమైనా ఉంటే తక్షణం బీమా కంపెనీకి తెలియజేయాలి. ఈ విషయంలో ఆలస్యం సరికాదు. వివరాలు అన్నీ క్షుణ్ణంగా సంబంధిత అధికారికి అందజేయాలి.

క్లెయిమ్ సమయంలో దాఖలు చేయాల్సిన పత్రాల గురించి పాలసీ కాంట్రాక్టులోనే ఉంటుంది (ఉదా. డెత్ సర్టిఫికెట్, డాక్టర్ రిపోర్టు, నామినీ కేవైసీ పత్రాలు మొదలైనవి). వాటి గురించి తెలుసుకోవాలి.

క్లెయిమ్ చేయాల్సి వస్తే సాధ్యమైనంత త్వరగా ఘటన గురించి బీమా కంపెనీకి తెలియజేయాలి. అవసరమైన పత్రాలన్నీ అందించాలి.

క్రమం తప్పకుండా ప్రీమియంలు కట్టడం చాలా ముఖ్యం. లేకపోతే పాలసీ ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుంది. ఇలా బీమా పాలసీ విషయంలో జాగ్రత్తలన్నీ పాటిస్తే.. క్లెయిమ్ ప్రక్రియ వేగంగా, సులభంగా పూర్తవుతుంది.

ప్రత్యామ్నాయాలూ ఉన్నాయి...
అన్నీ సరిగ్గా చేసినా క్లెయిమ్ పరిష్కారంలో సమస్యలెదురైతే ప్రత్యామ్నాయాలేంటి? ఒకసారి చూద్దాం... పాలసీ క్లెయిమ్ వస్తే బీమా కంపెనీ 30 రోజుల్లోపు పరిష్కరించాలి. తిరస్కరిస్తే దానికి కారణాలు కూడా చెప్పాలి. కంపెనీ అలా చెయ్యకుంటే బీమా అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించొచ్చు. రూ.20 లక్షల విలువ వరకు గల పాలసీ కేసులను అంబుడ్స్‌మన్ విచారించే అవకాశం ఉంది. ఒకవేళ క్లెయిమ్ కరెక్టేనని, బీమా కంపెనీ తప్పిదం వల్లే అది ఆలస్యమవుతోందని అంబుడ్స్‌మన్ భావిస్తే... పరిహారం విషయమై బీమా కంపెనీలకు ఆదేశాలివ్వటం కూడా జరుగుతుంది.

 ఐఆర్‌డీఏ సాయం కూడా...
బీమా కంపెనీల సేవా లోపాలు, ఏజెంట్ల తీరుపై పాలసీదారులు బీమా నియంత్రణ ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏ)కు ఫిర్యాదు చేయవచ్చు. కాల్ సెంటర్‌కు 155255కు ఫోన్ కాల్ ద్వారా   లేదా ఐఆర్‌డీఏ తాలూకు ఐఆర్‌జీఏ పోర్టల్‌లో igms.irda.gov.in ఫిర్యాదు దాఖలు చేసే అవకాశం ఉంది.

 వినియోగదారుల ఫోరానికి...
ఈ వేదికల్లో సమస్యకు పరిష్కారం లభించకపోతే పాలసీదారులు నేరుగా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించవచ్చు. అతి తక్కువ వ్యయంతో తక్కువ సమయంలోనే తగిన న్యాయ సహాయం పొందడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తలు