హెచ్సీఎల్ టెక్ లాభం 14% అప్

29 Apr, 2016 00:24 IST|Sakshi
హెచ్సీఎల్ టెక్ లాభం 14% అప్

మార్చి క్వార్టర్‌లో రూ.1,926 కోట్లు...
ఆదాయం రూ.10,698 కోట్లు; 15 శాతం వృద్ధి
సీక్వెన్షియల్‌గా మాత్రం లాభంలో వృద్ధి 0.3 శాతమే
షేరుకి రూ.6 చొప్పున డివిడెండ్

 న్యూఢిల్లీ: దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్లను నిరుత్సాహానికి గురిచేశాయి. జనవరి-మార్చి త్రైమాసికానికి(2015-16) కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.1,926 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో లాభం రూ.1,683 కోట్లతో పోలిస్తే 14.4 శాతం వృద్ధి చెందింది. ప్రధానంగా లైఫ్‌సెన్సైస్, ప్రజా సేవలు, టెలికం విభాగాల ఆదాయం పుంజుకోవడం లాభాలు పెరిగేందుకు దోహదం చేసింది.

ఇక మొత్తం ఆదాయం కూడా మార్చి క్వార్టర్‌లో 15.4 శాతం వృద్ధి చెంది రూ.9,267 కోట్ల నుంచి రూ.10,698 కోట్లకు ఎగబాకింది. కంపెనీ జూలై-జూన్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణనలోకి తీసుకుంటూవస్తోంది. అయితే, కంపెనీల చట్టం-2013 నిబంధనల మేరకు ఇకపై ఇతర కంపెనీల మాదిరిగానే ఏప్రిల్-మార్చి కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించనుంది.

 సీక్వెన్షియల్‌గా చూస్తే...
డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో లాభం రూ.1,920 కోట్లతో పోలిస్తే(సీక్వెన్షియల్ ప్రాతిపదికన) మార్చి త్రైమాసికంలో వృద్ధి 0.3 శాతం మాత్రమే నమోదైంది. ఆదాయం సైతం 3.4 శాతం మాత్రమే(డిసెంబర్ క్వార్టర్‌లో రూ.10,341 కోట్లు) పెరిగింది. పరిశ్రమ విశ్లేషకులు హెచ్‌సీఎల్ టెక్ సగటున రూ.1,963 కోట్ల నికర లాభాన్ని(సీక్వెన్షియల్‌గా 2.2 శాతం వృద్ధి), రూ.10,805 కోట్ల ఆదాయాన్ని(4.5 శాతం వృద్ధి) ఆర్జించవచ్చని అంచనా వేశారు. అయితే, కంపెనీ ఫలితాలు ఈ అంచనాలను అందుకోలేకపోయాయి.

 మార్చితో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి కంపెనీ కొత్తగా 25 కాంట్రాక్టులను చేజిక్కించుకుంది. వీటి మొత్తం విలువ 4 బిలియన్ డాలర్లకుపైనే ఉంటుందని హెచ్‌సీఎల్ టెక్ ప్రెసిడెంట్, సీఈఓ అనంత్ గుప్తా పేర్కొన్నారు. ఒక్క మార్చి క్వార్టర్‌లోనే 2 బిలియన్ డాలర్ల విలువైన 7 కాంట్రాక్టులు లభించినట్లు ఆయన వెల్లడించారు. బియాండ్ డిజిటల్, ఐఓటీ, నెక్స్ట్ జెన్ ఐటీఓ వంటి పరిజ్ఞానాలపై తాము పెడుతున్న పెట్టుబడులు ఆదాయాల జోరుకు చేదోడుగా నిలుస్తున్నాయని ఆయన చెప్పారు. కాగా, మార్చి క్వార్టర్‌లో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆదాయం 1.3 శాతం తగ్గగా.. లైఫ్‌సెన్సైస్, హెల్త్‌కేర్ విభాగాల నుంచి ఆదాయం 6.4 శాతం, 7.1 శాతం చొప్పున వృద్ధి చెందిందని గుప్తా వెల్లడించారు. టెక్సాస్‌లో డిజైన్ థింకింగ్, ప్రాసెస్ డిజిటైజేషన్ ల్యాబ్‌ను నెలకొల్పుతున్నామని.. అదేవిధంగా మధురై, లక్నోలలో డెలివరీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు గుప్తా తెలిపారు.

ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేరుకి కంపెనీ రూ. 6 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది.
డాలర్ల రూపంలో చూస్తే నికర లాభం మార్చి క్వార్టర్‌లో 5.5 శాతం ఎగబాకి 285.1 మిలియన్లుగా నమోదైంది. ఆదాయం కూడా 6.5 శాతం వృద్ధి చెంది 1.58 బిలియన్ డాలర్లకు చేరింది.
2015-16 పూర్తి ఏడాదికి లాభం 0.7 శాతం పెరిగి రూ.7,354 కోట్లుగా నమోదైంది. ఆదాయం 14.6 శాతం ఎగసి రూ.40,914 కోట్లకు చేరింది.
మార్చి క్వార్టర్‌లో స్థూలంగా 9,280 మంది సిబ్బందిని హెచ్‌సీఎల్ టెక్ నియమించుకుంది. అయితే, 8,080 మంది వలసపోవడంతో నికరంగా 1,200 మంది జతయ్యారు. దీంతో మార్చి 31 నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,04,896కు చేరింది.
ఉద్యోగుల వలసల(అట్రిషన్) రేటు 17.3 శాతానికి చేరింది(డిసెంబర్ క్వార్టర్‌లో 16.7 శాతం).
కంపెనీ షేరు ధర గురువారం బీఎస్‌ఈలో 4.51 శాతం క్షీణించి రూ.800 వద్ద స్థిరపడింది.

>
మరిన్ని వార్తలు