కొసరి కొసరి వడ్డిస్తున్న అంబానీ కుటుంబం!

8 Dec, 2018 06:45 IST|Sakshi

అన్నదాత సుఖీభవ, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అనేవి మనం వింటూ ఉంటాం. మనం ఏం పని చేసినా.. జానెడు పొట్ట నిండటం కోసమే కదా. అలా పక్కవారి కడుపునిండా అన్నం పెట్టడంలో ఉండే సంతృప్తి ఎందులోనూ ఉండదు. ఇలాంటి గొప్పకార్యక్రమంతో అంబానీ ఇంట వివాహ మహోత్సవం ఘనంగా మొదలైంది. ఉదయ్‌పూర్‌లో అంబానీ కుటుంబసభ్యులు శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరిపించారు. అంబానీ కుటుంబ సభ్యులు ముకేశ్ అంబానీ, నీతా అంబానీ, అజయ్, స్వాతి పిరమాల్, ఇషా, ఆనంద్ పాల్గొని.. 5,100 మందికి ఆహార పదార్ధాలను వడ్డించారు.

ఇషా అంబానీ-ఆనంద్‌ పిరమాల్‌ల వివాహం డిసెంబర్ 12న ముంబయిలో ఘనంగా జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరు కుటుంబాల్లో పెళ్లి సందడి నెలకొంది. ఉదయ్‌పూర్ (రాజస్థాన్)లో ఈషా అంబానీ పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచే అక్కడ సంబరాలు మొదలయ్యాయి. ఉదయ్‌పూర్ వాసుల ఆశీర్వాదం తీసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది అంబానీ కుటుంబం. పెళ్లి వేడుకల్లో భాగంగా డిసెంబర్‌ 7 నుంచి డిసెంబరు 10 వరకు నాలుగు రోజుల పాటు నిత్యాన్నదానం చేస్తున్నారు. అందులో దివ్యాంగులే ఎక్కువగా ఉన్నారు. ఇలా నాలుగు రోజులు మూడు పూటలా వారికి భోజనం పెట్టనున్నారు. అన్నదానంతో పాటు భారతీయ వస్తు కళలను ప్రమోట్ చేసేందుకు స్వదేశీ బజార్‌ పేరుతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తోంది. దేశీయ కళా ఉత్పత్తులను అందులో ప్రదర్శిస్తారు. దీని ద్వారా స్థానిక వ్యాపారులకు లాభం చేకూరనుంది. ఈ ఎగ్జిబిషన్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు, అంతర్జాతీయ అతిథులు తరలిరానున్నారు. కాగా, డిసెంబరు 8, 9న ఈషా-ఆనంద్ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. డిసెంబరు 12న అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరగనుంది.

(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

>
మరిన్ని వార్తలు