మేము టెస్ట్‌ట్యూబ్‌ బేబీలము : ఇషా అంబానీ

31 Jan, 2019 19:57 IST|Sakshi
సోదరుడు ఆకాశ్‌ అంబానీతో ఇషా అంబానీ

గత కొన్ని రోజులగా తన పెళ్లి విశేషాలతో వార్తల్లో నిలిచిన ఆసియా కుబేరుడు ముఖేష్‌ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ మరోసారి వార్తల్లోకెక్కారు. ఓ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వూలో తన గురించి ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. ‘మా అమ్మానాన్నల పెళ్లి జరిగిన ఏడేళ్లకు నేను, నా కవల సోదరుడు ఆకాశ్‌ జన్మించాం. మేమిద్దరం ఐవీఎఫ్‌(ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్- టెస్ట్‌ట్యూబ్‌ బేబీ‌) పద్ధతి ద్వారా జన్మించాం. మాకు ఐదేళ్లు వచ్చే దాకా మా అమ్మ తన పూర్తి సమయాన్ని మాకోసమే వెచ్చించారు. అయితే తను చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు’ అంటూ ఇషా చెప్పుకొచ్చారు.

డబ్బు విలువ బాగా తెలుసు
‘ తన కలలను నెరవేర్చుకునేందుకు, రిలయన్స్‌ను మేటి సంస్థగా నిలిపేందుకు మా నాన్న పడ్డ కష్టాన్ని చూస్తూ పెరిగాను. ఎంత బిజీగా ఉన్నప్పటికీ మాకు తన అవసరం ఉందనిపిస్తే మాత్రం మా దగ్గరే ఉండిపోయేవారు. మా అమ్మానాన్నలు ఎలాంటి పరిస్థితుల్లో పెరిగారో మమ్మల్ని కూడా అలాగే పెంచారు. వారి పెంపకం వల్లే క్రమశిక్షణ, వినయ విధేయతలు అలవడ్డాయి. డబ్బు విలువ కూడా మాకు బాగా తెలుసు’ అని ‘జియో’ సృష్టికర్త ఇషా వ్యాఖ్యానించారు.

కాగా గతేడాది డిసెంబరు 12న ఇషా అంబానీ- పిరమాల్‌ గ్రూప్‌ వారసుడు ఆనంద్‌ పిరమాల్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలోని అంబానీ నివాసం అంటిలియాలో జరిగిన వివాహ వేడుకకు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ సహా పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు హాజరై సందడి చేశారు. దేశంలో అత్యంత ఖరీదైన వివాహ వేడుకగా నిలిచిన ఇషా పరిణయం నిలిచింది.

భర్త ఆనంద్‌ పిరమాల్‌తో ఇషా అంబానీ

మరిన్ని వార్తలు