ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఇస్రో టెక్నాలజీ!

22 Jan, 2018 00:36 IST|Sakshi

లిథియం అయాన్‌ బ్యాటరీలపై కమిటీ సూచన

న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రికల్‌ వాహనాలను పరుగులు పెట్టించేందుకు వీలుగా ఓ కీలకమైన సూచనను ఆర్థిక శాఖ కార్యదర్శి పి.కె.సిన్హా  నేతృత్వంలోని కమిటీ కేంద్రం ముందుంచింది. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రూపొందించిన లిథియం అయాన్‌ బ్యాటరీల టెక్నాలజీని వాణిజ్య అవసరాలకు వినియోగించేందుకు అనుమతించాలన్నదే ఆ సూచన.

అలాగే, వాహనాల బ్యాటరీల చార్జింగ్‌ సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు వీలుగా కేంద్ర విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌తో కలసి విద్యుత్‌ శాఖ విద్యుత్‌ చార్జీలను, అనుసంధాన విధానాలను నిర్ణయించాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. ‘‘తగిన అమమతుల అనంతరం ఇస్రో లిథియం అయాన్‌ బ్యాటరీ టెక్నాలజీని ‘మేకిన్‌ ఇండియా’  కార్యక్రమం కింద వివక్షకు తావులేని వాణిజ్య అవసరాలకు అనుమతించే అంశాన్ని పరిశీలించాలి’’ అని ఈ కమిటీ సూచించింది.

ప్రస్తుతం దేశంలో వాణిజ్య ప్రాతిపదికన లిథియం అయాన్‌ బ్యాటరీలు తయారవడం లేదు. వీటిని జపాన్, చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దేశ చమురు అవసరాలకు ప్రస్తుతం ఏటా రూ.7 లక్షల కోట్లను వెచ్చించాల్సి వస్తుండడంతో, ఎలక్ట్రికల్‌ వాహనాల వినియోగా న్ని పెంచడం ద్వారా కాలుష్యానికి చెక్‌ పెట్టడంతోపాటు, దిగుమతుల బిల్లును తగ్గించుకోవచ్చని కేంద్రం భావిస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు