మీ ఇంట్లో పెళ్లికి ఐటీ వాళ్లొచ్చేస్తారు!

3 Apr, 2017 05:08 IST|Sakshi
మీ ఇంట్లో పెళ్లికి ఐటీ వాళ్లొచ్చేస్తారు!

పెళ్లి ఖర్చుకి.. బ్యాంక్‌ బ్యాలెన్స్‌కు ముడి
లెక్క తప్పిందా.. పన్ను కట్టాల్సిందే
అప్పు తెచ్చుకున్న సొమ్ముకూ పత్రాలుండాల్సిందే
నెలవారీ ఖర్చులపైన కూడా నిఘా
ప్రతి పైసాకూ లెక్కచెప్పాల్సిందే   


నవంబర్‌ 8, 2016న రూ.1,000, రూ.500 నోట్ల రద్దుతో షాకిచ్చిన కేంద్రం.. తాజాగా ఆదాయపు పన్ను చట్ట సవరణతో మరొక ఝలక్‌ ఇచ్చింది. ఆదాయపు పన్ను పరిశీలన పేరిట సామాన్యులను వేధించబోమని పదే పదే వల్లెవేస్తున్నా.. తాజా చట్ట సవరణతో మాత్రం వేధింపులు తప్పేలా లేవు. వ్యక్తులు తమ ఆదాయానికి, వ్యయానికి సరైన వివరణ ఇవ్వలేకపోతే ఐటీ చట్టం ప్రకారం 35 శాతం నుంచి 83 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. తాజా చట్ట సవరణతో పన్ను చెల్లింపుదారులకు ఎదురయ్యే 5 ప్రధాన ఇబ్బందులివే..

అప్పు తెచ్చుకున్నా తిప్పలే
స్నేహితుడి నుంచో లేక తెలిసిన వాళ్ల నుంచో అప్పు తెచ్చుకున్నా సరే ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారించే అధికారం ఉంది. ఒకవేళ మీరు సంబంధిత సొమ్మును అప్పుగా తీసుకొచ్చినట్లు నిరూపించలేని పక్షంలో సంబంధిత సొమ్ము పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ఒక్కసారిగా మీకు బ్యాంక్‌ ఖాతాలో డబ్బు జమ అయినా సరే వివరణ ఇవ్వాల్సిందే. అది కూడా నిరూపించలేకపోతే పన్ను తిప్పలు తప్పవు.

వారసత్వ బంగారం
వారసత్వంగా వచ్చిన బంగారం, నగలు లేదా వ్యవసాయ ఆదాయం ద్వారా వాటిని కొనుగోలు చేసినా సరే ఆదాయ పన్ను చట్టాలు వర్తించవు. అయితే సంబంధిత వ్యక్తి వాటిని నిరూపించలేకపోతే మాత్రం ఐటీ చట్టం పరిధిలోకి వచ్చేస్తాడు. అంటే నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాల్సి వస్తుంది.

సీడ్‌మనీకి పత్రాలుండాలి
చిన్నతరహా పరిశ్రమలు, స్టార్టప్స్‌ కంపెనీని ప్రారంభించే సమయంలో పెట్టే సీడ్‌మనీకి సంబంధించిన పత్రాలను భద్రంగా ఉంచుకోవాలి. ఐటీ అధికారులకు రికార్డులను సమర్పించడంలో విఫలమైతే మూలధన మొత్తం మీద అధిక పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

పెళ్లి ఖర్చుకూ లెక్క
అప్పు తెచ్చి మరీ పిల్లల పెళ్లిళ్లు చేయడం దేశంలో సర్వసాధారణం. అయితే తాజా ఐటీ నిబంధనలతో మాత్రం పెళ్లి ఖర్చులను కూడా ఐటీ అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. అంటే మీ బ్యాంక్‌ బ్యాలెన్స్‌కు, పెళ్లి ఖర్చుకూ మధ్య వ్యత్యాసముంటే మాత్రం వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

నెలవారీ ఖర్చులు పెరిగితే
నెలవారీ ఖర్చులు ఒక్కసారిగా పెరిగినా సరే ఐటీ ఇబ్బందులు తప్పేలా లేవు. ఎందుకంటే ఐటీ విభాగం మీ బ్యాంక్‌ ఖాతాలపై దృష్టి పెడుతుంది. పెరిగిన నెలవారీ ఖర్చులను ఎలా భరించారో? అంత సడెన్‌గా ఖర్చులకు డబ్బులెక్కడి నుంచి వచ్చాయో వివరణ అడగొచ్చు. సంతృప్తికరమైన వివరణ ఇవ్వటంలో విఫలమైతే మీకు భారీ జరిమానా తప్పదు.

మరిన్ని వార్తలు