సక్రమంగా పన్ను చెల్లిస్తే సత్కారం!

16 Sep, 2016 00:29 IST|Sakshi
సక్రమంగా పన్ను చెల్లిస్తే సత్కారం!

దశాబ్దాల తర్వాత మళ్లీ సీబీడీటీ శ్రీకారం

 న్యూఢిల్లీ: నిజాయితీగా ప్రభుత్వానికి పన్నులు చెల్లించేవారిని సత్కరించే కార్యక్రమానికి ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ మళ్లీ శ్రీకారంచుడుతోంది. గడిచిన కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా పన్ను చెల్లిస్తున్న దేశంలోని లక్షలాది మంది ట్యాక్స్‌పేయర్లను కేంద్రీయ ప్రత్యక్షపన్నుల విభాగం(సీబీడీటీ) త్వరలోనే సన్మానించనుంది. దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ విధమైన చర్యలను అమలు చేసే ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవలే ఆమోదించిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీనిప్రకారం సీబీడీటీ పన్నుచెల్లింపుదారులను అధిక మొత్తంలో, క్రమం తప్పకుండా, నిబంధనలకు అనుగుణంగా, నిబద్ధతతో వ్యవహరించడం... ఇలా నాలుగు విభాగాలుగా విభజించింది.

వీరికి సీబీడీటీ చైర్‌పర్సన్ సంతకంతో సన్మాన పత్రాలను ఈ-మెయిల్ ద్వారా పంపనున్నారు. అయితే, కొంతమందిని ప్రత్యక్షంగా కూడా సత్కరించి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేతులమీదుగా సర్టిఫికెట్లను ప్రదానం చేయనుండటం విశేషం. నిజాయితీగా, క్రమం తప్పకుం డా పన్నులు చెల్లించడం ద్వారా దేశ పురోభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నవారికి ధన్యవాదాలు తెలియజేయడంతోపాటు తగినవిధంగా గౌరవించాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మళ్లీ మొదలుపెడుతున్నట్లు సీబీడీటీ వర్గాలు పేర్కొన్నాయి.

 ఈ ఏడాది ఆరంభంలో సీబీడీటీ తమ అధికారుల కోసం నిర్వహించిన ఒక సదస్సులో ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించే అంశాన్ని చర్చించి.. ప్రతిపాదనలను రూపొందించింది. తమ కార్యాలయ పరిధిలో ఇటువంటి నిజాయితీగల పన్ను చెల్లింపుదారులను గుర్తించి, వారి పేర్లను పంపాల్సిందిగా  ప్రాంతీయ ఐటీ కమీషనర్లకు సీబీడీటీ సూచించినట్లు సమాచారం. కాగా, ఈ సత్కారాలకోసం సిఫార్సుచేసే ట్యాక్స్‌పేయర్ల సంఖ్య లక్షల్లోనే ఉండొచ్చని ఐటీ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం కూడా ఐటీ శాఖ ఈ స్కీమ్‌ను అమలు చేసింది. అయితే, తమకు నేరగాళ్లనుంచి బెదిరింపులు వస్తున్నాయంటూ కొంతమంది బడా పన్నుచెల్లింపుదారులు ఫిర్యాదులు చేయడంతో ఆతర్వాత దీన్ని నిలిపివేసింది.

మరిన్ని వార్తలు