రిలయన్స్‌ జియోకు ట్రిబ్యునల్‌లో విజయం

26 Dec, 2019 05:10 IST|Sakshi

టవర్ల డీమెర్జర్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ తన ఆప్టికల్‌ ఫైబర్, టవర్‌ వ్యాపారాలను వేరు చేయడాన్ని (డీమెర్జర్‌) వ్యతిరేకిస్తూ ఆదాయపన్ను శాఖ దాఖలు చేసిన పిటిషన్‌ను జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) కొట్టివేసింది. జియో డిజిటల్‌ ఫైబర్‌ ప్రైవేటు లిమిటెడ్, రిలయన్స్‌ జియో ఇన్ఫ్రాటెల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరుతో రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ తన ఫైబర్, టవర్‌ వ్యాపారాలను వేరు చేయాలని నిర్ణయించుకుంది.

ఇందుకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ అహ్మదాబాద్‌ బెంచ్‌ అనుమతి మంజూరు చేసింది. దీనిపై ఆదాయపన్ను శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘డీమెర్జర్‌ స్కీమ్‌ ప్రకారం రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ రెడీమబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్లను రుణాలుగా మార్చాల్సి ఉంటుంది. ఈక్విటీని డెట్‌గా మార్చడం అన్నది కంపెనీ లా సూత్రాలకు వ్యతిరేకం. అంతేకాదు బదిలీ కంపెనీ (జియోఇన్ఫోకామ్‌) లాభదాయక లేదా నికర ఆదాయం తగ్గిపోతుంది. ఇది ఆదాయపన్ను విభాగానికి ఆదాయ నష్టాన్ని కలిగిస్తుంది’’ అని ఆదాయపన్ను శాఖ వాదించింది.
 

మరిన్ని వార్తలు