ఐటీ కంపెనీలపై సంచలన కేసు

11 Sep, 2019 13:27 IST|Sakshi

ఐటీ పరిశ్రమలో మైలురాయి లాంటి కేసు

4 వారాల్లో స్పందించండి  - తెలంగాణా హైకోర్టు

తెలంగాణా  ప్రభుత్వానికి నోటీసులు

ఉపాధి పేరిట రాష్ట్రంలో  వైట్ కాలర్డ్ బానిసత్వం - టెక్కీలు

సాక్షి, హైదరాబాద్‌: ఐటీ కంపెనీల్లో టెక్కీల కష్టాలు, పని ఒత్తిడి తదితర అంశాలపై చాలా కథనాలు ఇప్పటివరకూ విన్నాం. చదివాం. అయితే తాజాగా ప్రముఖ ఐటీ కంపెనీలపై ఉద్యోగులు ఏకంగా  కోర్టుకెక‍్కడం  సంచలనం రేపుతోంది. యాక్సెంచర్, కాగ్నిజెంట్‌, కాస్పెక్స్ కార్పొరేషన్ కంపెనీలపై హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు ఐటి ఉద్యోగులు కేసు నమోదు చేశారు. ఫోరమ్ ఎగైనెస్ట్  కరప్షన్‌ కార్యకర్తల బృందంతో కలిసి వీరు తెలంగాణ పిల్‌ హైకోర్టులో దాఖలు చేశారు. భారతదేశ ఐటి పరిశ్రమ చరిత్రలోనే ఒక మైలురాయి లాంటిదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 

"ఉపాధి పేరిట రాష్ట్రంలో వైట్ కాలర్డ్ బానిసత్వం" అని టెక్కీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా  ఎక్కువ పని గంటలు, ప్రోత్సాహకాలు ప్రకటించకపోవడం, చెత్త  లీవ్ విధానం లాంటి వివిధ ఆరోపణలతో ఫిర్యాదు నమోదు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు అంగీకరించింది. దీనిపై నాలుగు వారాల్లో స్పందించాల్సిందిగా ఐటీ సంస్థలను ఆదేశించింది. అలాగే ఈ వ్యవహారంపై స్పందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి  కూడా కోర్టు నోటీసులిచ్చింది.

ఐటి ఉద్యోగుల జీవితాలను మెరుగుపర్చడానికి,  సంస్థల పని సంబంధిత దోపిడీని నిలువరించడానికి ఈ పిల్ దాఖలు చేశామని ఫోరం ఎగైనెస్ట్ అవినీతి అధ్యక్షుడు విజయ్ గోపాల్  వెల్లడించారు.
అదనపు వేతనం లేకుండా దాదాపు పది గంటల విధులు, కార్యాలయ క్యాబ్‌ల ద్వారా రోజువారీ ప్రయాణంలో 4-5 గంటలు గడపవల్సి రావడం,  సెలవులను సమయానికి కేటాయించకపోవడం లాంటి ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయన్నారు.  

చట్టం ఏమి చెబుతుంది?
2002 లో ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ప్రకారం తెలంగాణ, హైదరాబాద్, ఇతర ఐటి హబ్‌లలో వర్తించే చట్టాలు ఆసక్తికర విషయాలను వివరిస్తున్నాయి.  

  • ఉద్యోగులను వారానికి 48 గంటలు/ లేదా రోజుకు 8 గంటలు పని 
  • ఓవర్ టైం వారానికి 6 గంటలు,  సంవత్సరానికి 24 గంటలు మాత్రమే
  • ప్రతి ఉద్యోగికి సంవత్సరంలో 15 రోజుల పెయిడ్ లీవ్, 12 రోజుల క్యాజువల్ లీవ్, 12 రోజుల సిక్ లీవ్ ఇవ్వాలి

మరోవైపు రాష్ట్రంలో (అప్పటి ఆంధ్రప్రదేశ్) తమ కార్యాలయాలను స్థాపించడానికి మరిన్ని ఐటి సంస్థలను ప్రోత్సహించేందుకు ఈ కార్మిక చట్టాలను దాటవేయడానికి వీలు కల్పించింది. మొత్తం 6 విభాగాలను బైపాస్ చేయడానికి అనుమతించారు. వీటిలో ప్రారంభ, ముగింపు గంటలు, రోజువారీ, వారపు పని గంటలు, సెలవులతోపాటు ఉద్యోగం నుంచి తొలిగించిన సందర్భంలో ఉద్యోగిని రక్షించడానికి నిబంధనలున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమింటే  ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే  ఆయా కంపెనీలకు కేవలం 100 రూపాయల జరిమానా మాత్రమే ప్రభుత్వం విధించవచ్చు. ఈ చట్టాన్నిమరో రెండేళ్లపాటు పొడిగిస్తూ  2019లో తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

మరిన్ని వార్తలు