ఐటీ మినహాయింపు పరిమితి రెట్టింపు చేయాలి

10 Jan, 2019 00:50 IST|Sakshi

రూ. 5 లక్షలకు చేర్చాలి...

సెక్షన్‌ 80సీ డిడక్షన్‌ పరిమితి పెంచాలి

కేంద్రానికి సీఐఐ వినతి

న్యూఢిల్లీ: వచ్చే నెల 1న కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వ్యక్తిగత ఆదాయాలపై పన్ను మినహాయింపుల పరిమితిని పెంచాలంటూ కేంద్రాన్ని పరిశ్రమ వర్గాలు కోరాయి. ఐటీ మినహాయింపును రెట్టింపు స్థాయికి రూ.5 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశాయి. అలాగే పొదుపును ప్రోత్సహించే దిశగా సెక్షన్‌ 80సి కింద డిడక్షన్‌ పరిమితిని కూడా ప్రస్తుతమున్న రూ. 1.5 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచాలని కోరాయి. ఆర్థిక శాఖకు సమర్పించిన ప్రి–బడ్జెట్‌ కోర్కెల చిట్టాలో పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఈ మేరకు విజ్ఞప్తులు చేసింది. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. 

కార్పొరేట్‌ ట్యాక్స్‌ 25 శాతానికి తగ్గించాలి..
ప్రస్తుతం రూ. 2.5 లక్షల దాకా వ్యక్తిగత ఆదాయంపై పన్ను మినహాయింపులు ఉంటున్నాయి. రూ. 2.5–5 లక్షల దాకా ఆదాయంపై 5 శాతం, రూ. 5–10 లక్షల దాకా 20 శాతం, రూ. 10 లక్షలు దాటితే 30 శాతం మేర పన్ను రేటు వర్తిస్తోంది. కేంద్ర ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయంపై పన్ను మినహాయింపుల పరిమితిని రూ. 5 లక్షలకు పెంచాలని సీఐఐ కోరింది. ఇక రూ. 5–10 లక్షల శ్లాబ్‌లో రేటును 10 శాతానికి, రూ. 10–20 లక్షల ఆదాయంపై పన్నును 20 శాతానికి తగ్గించాలని కూడా సిఫార్సు చేసింది. రూ. 20 లక్షలు పైగా ఆదాయం ఉన్న వారిపై 25 శాతం పన్ను రేటు విధించాలని కోరింది. వైద్య వ్యయాలు, రవాణా అలవెన్సులకు కూడా మినహాయింపులు ఇవ్వాలని పేర్కొంది. మరోవైపు కార్పొరేట్‌ ట్యాక్స్‌ను కూడా టర్నోవర్‌తో సంబంధం లేకుండా 25 శాతానికి తగ్గించాలని, ఆ తర్వాత క్రమానుగతంగా దీన్ని 18 శాతం స్థాయికి తేవాలని విజ్ఞప్తి చేసింది. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 80సీ కింద డిడక్షన్‌ పరిమితిని ప్రస్తుతమున్న రూ. 1.5 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచితే పొదుపు చేసేందుకు మరింత అవకాశం కల్పించినట్లవుతుందని సీఐఐ తెలిపింది. రూ. 40,000 స్టాండర్డ్‌ డిడక్షన్‌తో పాటు వైద్య చికిత్స వ్యయాలు, రవాణా అలవెన్సులకు మినహాయింపులు పునరుద్ధరించాలని కోరింది. స్వల్పకాలిక క్యాపిటల్‌ గెయిన్స్‌తో దీర్ఘకాలిక మూలధన నష్టాలను సెటాఫ్‌ చేసుకునేందుకు అనుమతించాలని పేర్కొంది.  

మరిన్ని వార్తలు