ఉద్యోగుల తొలగింపులో పారదర్శకత ఉండాలి

21 Jul, 2017 01:11 IST|Sakshi
ఉద్యోగుల తొలగింపులో పారదర్శకత ఉండాలి

నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌
చెన్నై: ఏ ఉద్యోగినైనా తొలగించాల్సి వచ్చినప్పుడు ఐటీ కంపెనీలు కటువుగా కాకుండా పారదర్శకంగా, సున్నితంగా వ్యవహరించాలని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌.చంద్రశేఖర్‌ చెప్పారు. ఇటీవల ఓ ఐటీ కంపెనీలో ఉద్వాసనకు గురైన ఉద్యోగితో మానవ వనరుల విభాగం సిబ్బంది కటువుగా వ్యవహరించిన ఆడియో లీకైన ఉదంతంపై స్పందిస్తూ చంద్రశేఖర్‌ ఈ విషయం చెప్పారు.

ఎవరూ ఉద్యోగాలు కోల్పోవాలని తాము కోరుకోమని, కానీ కొన్ని సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయని వ్యాఖ్యానించారు. ఏ ఒక్క సంస్థ గురించో ప్రత్యేకంగా తాను మాట్లాడబోనని,∙కంపెనీలు ఇలాంటి సందర్భాల్లో సున్నితత్వంతోనూ, పారదర్శకంగా, నేర్పుగా వ్యహరించాలని చంద్రశేఖర్‌ తెలిపారు. ‘పరిస్థితులు అత్యంత వేగంగా మారిపోతున్న ప్రస్తుత తరుణంలో ఏ కంపెనీ కూడా మా పాలసీ ఇదే.. మరో పదేళ్లయినా.. ఇరవై ఏళ్లయినా ఇలాగే ఉంటుందంటూ భీష్మించుకుని కూర్చునే పరిస్థితి లేదు‘ అని వ్యాఖ్యానించారు.   

ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపర్చాలి
ఐటీ రంగం మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నప్పటికీ .. సిబ్బంది నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం పరిశ్రమకు ముఖ్య అవసరంగా మారుతోందని చంద్రశేఖర్‌ చెప్పారు. ఆటోమేషన్‌తో ఉద్యోగాలకు కోత పడినా.. పరిశ్రమ అధిక స్థాయిలో వృద్ధి చెందుతున్న పక్షంలో నికరంగా ఉద్యోగాల కల్పన పెరుగుతూనే ఉంటుందన్నారు. ప్రస్తుతం దేశంలో ఇదే∙పరిస్థితి ఉందని.. ఉద్యోగాల కోత కన్నా ఎక్కువగా ఉద్యోగాల కల్పన జరుగుతోందని వివరించారు.

మరిన్ని వార్తలు