కొంటే ఏముంది? రెంటే బాగుంది!!

29 Jan, 2017 23:40 IST|Sakshi
కొంటే ఏముంది? రెంటే బాగుంది!!

కొనుక్కునే బదులు అద్దెకు తీసుకుంటే మేలు
గృహోపకరణాల నుంచి వ్యవసాయ పరికరాలు అందుబాటులో దుస్తులు, పుస్తకాలు, ఆభరణాలు, వాహనాలు, ఫర్నిచర్, బొమ్మలు అద్దెకు అవసరం తీరుతుంది; ఖర్చు ఆదా అవుతుంది తరచూ కొత్తవి మార్చుకోవచ్చు కూడా.. దేశంలో రూ.10,200 కోట్లకు చేరిన అద్దె విపణి ఉద్యోగాల బదిలీ, ప్రీమియం ఉత్పత్తులపై కోరికే వృద్ధికి కారణం: విశ్లేషకులు  

రమేష్, సునీత భార్యాభర్తలు. మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ నెల్లో దాదాపు నాలుగు ఫంక్షన్లకు అటెండ్‌ అవ్వాలి. అన్నీ దాదాపు బంధువులవే. ఇంట్లో బ్రాండెడ్‌ నుంచి డిజైనర్‌ దుస్తులదాకా చాలానే ఉన్నా... అన్నీ ఒకసారైనా వేసుకున్నవి కావటంతో ఫంక్షన్లకు కొత్తవి కొనాల్సిందే అనుకున్నారు. కానీ నాలుగు ఫంక్షన్లకీ కొత్తవి కొనాలంటే..? అమ్మో!! అనుకున్నారు. ఇంతలో రమేష్‌ స్నేహితుడు శేఖర్‌ వచ్చాడు. వీళ్ల సమస్య విని... ‘‘మంచి డిజైనర్‌ వేర్‌ను అద్దెకు తీసుకోవచ్చు కదా?’’ అంటూ సలహా ఇచ్చాడు.

‘‘నిజమా!! కార్లు, బైకులు అద్దెకిస్తారని తెలుసు కానీ... దుస్తులు కూడా ఇస్తారా?’’ అంటూ ఆశ్చర్యపోయాడు రమేష్‌. ‘‘అవేకాదు. జ్యుయలరీ, ఫర్నిచర్, బొమ్మలు... ఆఖరికి మీరో ఆఫీసు పెట్టి పది రోజులకు ఉద్యోగులు కావాలంటే కూడా పంపిస్తారు’’ అని వివరించాడు శేఖర్‌. ఇకనేం!! రమేష్, సునీత సమస్యకు పరిష్కారం దొరికింది. మీకూ ఆ పరిష్కారం కావాలా? దుస్తులు, ఆభరణాలు, వంటింటి సామగ్రి... ఇలా కావాల్సిన వస్తువులన్నీ ఎంచక్కా అద్దెకు తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ ప్రత్యేక కథనం..    
 
   
అద్దెకు వస్తువులు తీసుకోవటమంటే ఒకప్పుడు ఇల్లు మాత్రమే. తరవాత కార్లు, బైకులు అద్దె వ్యాపారంలోకి వచ్చాయి. కానీ ఇపుడు వంటింట్లోని సామగ్రి నుంచి వ్యవసాయ పరికరాల వరకూ అన్నీ అద్దె మార్కెట్లోకి వచ్చేశాయి. దీన్నే కాస్త స్టైల్‌గా ‘షేరింగ్‌ ఎకానమీ’ అని పిలుస్తూ అంతా షేరింగ్‌ బాట పడుతున్నారు. కొత్త కొత్త వ్యాపారాలకు దారులు తెరుస్తున్నారు.

నిజానికి ఈ రెంటల్‌ వ్యాపారంలో కస్టమర్‌ ఒక వస్తువును అద్దెకు తీసుకుని... దాన్ని వినియోగించుకున్నాక తిరిగి కంపెనీకి ఇచ్చేస్తాడు. కంపెనీ దాన్ని రీఫర్బిష్‌ చేసి తిరిగి కొత్తదానిలా మారుస్తుంది. అద్దెకు సిద్ధం చేస్తుంది. సాధారణంగా కంపెనీలు తమ ఉత్పత్తులను అద్దెకివ్వటానికి మూడు మార్గాల్ని అనుసరిస్తున్నాయి. అవి...

కొన్ని సంస్థలు ముందుగా ఉత్పత్తులను కొనేసి... వాటిని తమ వెబ్‌సైట్‌లో లిస్ట్‌ చేసి కస్టమర్లకు అద్దెకిస్తున్నాయి. ఫర్నీచర్, గృహోపకరణాలు, ఇంటీరియర్‌ ఈ విభాగంలో ఈ ధోరణి ఎక్కువ. కానీ ఈ వ్యాపారానికి కొంత పెట్టుబడి కావాలి.

వస్తువుల తయారీ సంస్థలు, వెండర్లు, వ్యక్తులు ఇతరత్రా మార్గాల ద్వారా అగ్రిమెంట్, లీజు మీద ఆయా సంస్థలు ఉత్పత్తులను సమీకరిస్తాయి. వాటిని తమ వెబ్‌సైట్లలో పెట్టి అద్దెకిస్తున్నాయి. బైకులు, కార్ల వంటివి ఈ విభాగంలో ఎక్కువ. ఈ వ్యాపారానికి మొదటి రకం మాదిరి ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు.

చాలామంది తమ దగ్గరున్న, అప్పటికి అవసరం లేని వస్తువులను ఇతరులకు అద్దెకివ్వాలనుకుంటారు. అలాంటి వారు ఉపయోగించుకోవటానికి రెంటల్‌ వెబ్‌సైట్లున్నాయి. ఒకరకంగా రెంటల్‌ అగ్రిగేటర్లన్న మాట. వారు ఈ వెబ్‌సైట్లలో తమ ఉత్పత్తులను ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. అవసరమున్న కస్టమర్‌ నేరుగా వస్తువు యజమానిని సంప్రదించి అద్దెకు తీసుకుంటాడు. ఈ వ్యాపారంలో వస్తువుల నాణ్యత, బాధ్యత విషయంలో సంస్థకు ఎలాంటి సంబంధం ఉండదు.

దుస్తులు: 3 గంటల నుంచి 3 రోజుల వరకూ
దుస్తుల విషయానికొచ్చేసరికి ఫ్లైరోబ్, స్విష్‌లిస్ట్, వ్రాప్డ్, లైబ్‌ రెంట్, క్లోజీ, ది క్లాతింగ్‌ రెంటల్, ది సైటల్‌ డోర్, స్టేజ్‌3 వంటి సంస్థలు ఆన్లైన్ లో అద్దెకిస్తున్నాయి. సంప్రదాయ దుస్తుల నుంచి డిజైనర్‌ వేర్స్‌ వరకూ అన్నింటినీ వీటి సాయంతో అద్దెకు తీసుకునే వీలుంది. పిల్లలు, మహిళలు, పురుషులు... ఇలా అన్ని విభాగాల్లోనూ ఇవి దుస్తులను అద్దెకిస్తున్నాయి. అద్దె గరిష్టంగా 3 గంటల నుంచి 3 రోజుల వరకు తీసుకునే వీలుంది. ఎఫ్‌సీయూకే, ఫరెవర్‌ న్యూ, అసూస్, మ్యాంగో, క్విర్క్‌బాక్స్‌ వంటి ప్రముఖ బ్రాండ్లు చాలానే ఉన్నాయి. రీతు కుమార్, మసాబా గుప్తా, సమ్మంత్‌ చౌహాన్, సెహ్లాఖాన్, సురేంద్రి వంటి ప్రముఖ డిజైనర్స్‌ కలెక్షన్స్  కూడా వీటిలో దొరుకుతున్నాయి. అయితే హైస్ట్రీట్‌ బ్రాండ్లకు మాత్రం ఎలాంటి ముందస్తు డిపాజిట్‌ అవసరం లేదు. డిజైనర్‌ దుస్తులకైతే 20 శాతం సొమ్మును డిపాజిట్‌గా ముందు చెల్లించాల్సి ఉంటుంది.

ఫర్నిచర్‌: ఫ్రీ డెలివరీ, పికప్‌
ఫర్నిచర్‌ను అద్దెకివ్వటానికి ఫ్యూర్లెన్కో, రెన్టొమొజో, గ్యారెంటెడ్, రెంటల్‌వాలా తదితర సంస్థలున్నాయి. తరచుగా ఉద్యోగ బదిలీ కారణంగా మారిన ప్రతి చోటా కొత్త ఫర్నిచర్‌ కొనుక్కోవటమంటే చాలా కష్టం. పోనీ అప్పటికే ఉన్న ఫర్నిచర్‌ను మారిన చోటికి తీసుకెళదామంటే రవాణా ఖర్చులు మామూలుగా ఉండవు. వాటి బదులు కొత్తవి కొనుక్కోవటమే బెటరనిపిస్తుంది. ఫర్నిచర్‌ రెంటల్‌ కంపెనీలకు ఊపిరి పోసింది ఈ అంశమే. అయితే ఈ సంస్థలు ఫర్నీచర్‌తో పాటూ హోం అప్లయెన్సెస్, గేమింగ్, కెమెరా, వైఫై, స్మార్ట్‌ డోర్‌ లాక్స్‌ వంటి ఇంటికి సంబంధించిన ప్రతి వస్తువునూ అద్దెకిస్తున్నాయి. దాదాపు అన్ని సంస్థలూ ఉచితంగా డెలివరీ, పికప్‌ సర్వీసులను అందిస్తున్నాయి. వీటిని ఎన్నాళ్లయినా అద్దెకు వాడుకోవచ్చు. కాకపోతే కాలం పెరుగుతున్న కొద్దీ అద్దె  కూడా పెరుగుతుంది. అదీ కథ.

బొమ్మలు: మెట్రోల్లోనే ఎక్కువ
పిల్లల కోసం ఆడుకునే బొమ్మలు ఒకసారి కొంటాం. నాలుగైదు సార్లు ఆడగానే... అది బోర్‌కొట్టి కొత్త బొమ్మ కావాలంటారు వాళ్లు. మరి పాత బొమ్మ సంగతో? అందుకే ఫన్ స్టేషన్, కిలోనేవాలా, రెంట్‌టాయ్స్, టాయ్‌ఎక్స్‌ప్రెస్, ఫ్రెండ్లీటాయ్స్‌ వంటి సంస్థలు బొమ్మలు అద్దెకిస్తున్నాయి. చాలా కంపెనీల సేవలు హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పుణె, అహ్మదాబాద్‌ వంటి పెద్ద నగరాలకే పరిమితమయ్యాయి. ఎందుకంటే మెట్రో నగరాలతో పోలిస్తే ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో బొమ్మల వినియోగం తక్కువని, నాణ్యత కాసింత తక్కువని ఫన్ స్టేషన్ ఫౌండర్‌ కశ్యప్‌ షా ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’కు తెలిపారు. బొమ్మల అద్దెలు వారం రోజుల నుంచి నెల, ఏడాది వారీగా ప్యాకేజీలుంటాయి. 2014లో ప్రారంభమైన ఫన్స్టేషన్లో 500 మంది రిజిస్టర్‌ యూజర్లున్నారని.. 400 లెగో సెట్స్‌ అద్దెకిచ్చామని ఆయన తెలియజేవారు.

వ్యవ‘సాయం’: అవసరమైతేనే ట్రాక్టర్‌
మిగతా ఆన్ లైన్ రెంటల్‌ కంపెనీలతో పోలిస్తే మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) కాస్త డిఫరెంటేనని చెప్పాలి. ఎందుకంటే ఇది ట్రింగో పేరిట సరికొత్త వ్యాపారానికి తెరతీసింది. ఓలా, ఉబెర్‌ సంస్థలు ఎలాగైతే కార్లను అద్దెకిస్తున్నాయో అదే తరహాలో ట్రింగో వేదికగా ట్రాక్టర్లను, వ్యవసాయ పరికరాలను అద్దెకు తీసుకోవచ్చన్నమాట. ‘‘మనది వ్యవసాయ ఆధారిత దేశం. 80శాతం మంది రైతులకు ట్రాక్టర్లు కొనాలనే కోరిక ఉన్నా ఆర్థిక స్థోమత సహకరించట్లేదు. దీంతో చాలా మంది రైతులు పశువుల మీద ఆధారపడి పొలాన్ని దున్నిస్తున్నారు. చాలా సమయం వృథా అవుతోంది. దీనికి పరిష్కారం చూపించేందుకే గతేడాది రూ.10 కోట్ల పెట్టుబడితో ట్రింగోను ప్రారంభించాం’’ అని సంస్థ సీఈఓ అరవింద్‌ కుమార్‌ చెప్పారు.

3 వేల మంది రైతుల వినియోగం..
ట్రింగో ఫిజికల్, డిజిటల్‌ ఇలా రెండు విధాలుగా పనిచేస్తుంది. ఫిజికల్‌ విధానంలో.. ఫ్రాంచైజీ సెంటర్లుంటాయి. ఈ స్టోర్లలో ట్రాక్టర్లు, పరికరాలు ఉంటాయి. వీటిని ఎలా వినియోగించాలో శిక్షణ ఇచ్చేందుకు నిపుణులూ అందుబాటులో ఉంటారు. డిజిటల్‌ విధానంలో కాల్‌ సెంటర్, యాప్‌ ద్వారా సేవలను పొందవచ్చు. ప్రస్తుతం ట్రింగో కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో 13 సెంటర్ల ద్వారా సేవలందిస్తుంది. సుమారు 3 వేల మంది రైతులు వినియోగించుకున్నారు. త్వరలోనే రాజస్థాన్, మధ్య ప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ ట్రింగో సేవలను ప్రారంభించనున్నట్లు అరవింద్‌ తెలిపారు.

బుక్స్‌: ఆధునిక టెక్నాలజీతో
‘చినిగిన చొక్కా అయినా తొడుక్కో.. మంచి పుస్తకం కొనుక్కో’ అనేది ఒకనాటి మాట. రెంటల్‌ కంపెనీలిపుడు ‘పుస్తకం కొనుక్కోవడమెందుకు అద్దెకు తీసుకో’ అని దీన్ని మార్చేశాయి. దేశంలో ఇండియారీడ్స్, డోర్‌స్టెప్స్‌ బుక్స్, లైబ్రరీవాలా, ఐరెంట్‌ షేర్, జస్ట్‌బుక్స్‌ వంటి పలు సంస్థలు పుస్తకాలను అద్దెకిస్తున్నాయి. ఇందులో క్రీడ, ఆధ్యాత్మిక, సామాజిక, కాల్పనిక, సాహిత్యం, టెక్నాలజీ ఇలా అన్ని పుస్తకాలూ అందించటం వీటి ప్రత్యేకత. బెంగళూరు ఐఐఎంలో ఏర్పాౖటెన జస్ట్‌ బుక్స్‌ హైదరాబాద్‌లో కూడా పలు బ్రాంచిలు ఏర్పాటు చేసింది. అద్దెకు తీసుకెళ్లిన బుక్స్‌ను గుర్తించడానికి బార్‌ కోడ్‌ రీడర్ల వంటి టెక్నాలజీని కూడా ఇది ఉపయోగిస్తోంది.

ఆభరణాలు: వారమైతే ఓకే!
ఈవ్స్‌ 24, రెంట్‌ జ్యుయలరీ, లక్సీపిక్, రెంటల్‌వాలా, ఫ్లైరోబ్‌ వంటి సంస్థలు బంగారు, వజ్రాల ఆభరణాలతో ఇమిటేషన్  జ్యుయలరీని అద్దెకు ఇస్తున్నాయి. ఒక రోజు నుంచి 7 రోజుల వరకు అద్దెకు తీసుకోవచ్చు. ముందుగా కస్టమర్‌ ఆయా సంస్థల కేవైసీని పూర్తి చేసి సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది.  నెల, ఏడాది వారీగా ప్యాకేజీలుంటాయి. ఈవ్స్‌24 వంటి కొన్ని సంస్థలైతే అద్దెతో పాటూ కస్టమర్లు కావాలంటే ఆయా నగలను నెలసరి వాయిదా పద్ధతుల్లో విక్రయిస్తాయి కూడా. ఒకసారి కస్టమర్‌ ఆభరణాలను వినియోగించుకొని తిరిగి ఇచ్చేశాక ఆయా నగలను శుద్ధి చేసి తిరిగి అద్దెకు రెడీగా ఉంచుతారని ఈ పరిశ్రమలోని వర్గాలు పేర్కొన్నాయి.

కార్లు, బైకులు, సైకిళ్లు: దూసుకుపో..
సొంత కారైతే నెలవారీ ఈఎంఐ, నిర్వహణ, బీమా వంటివి ఉంటాయి. ఏటా కారు విలువ కూడా తగ్గిపోతుంటుంది. అదే అద్దె కారైతే నచ్చిన కారులో షికారు చేయొచ్చు. ఇదే సెల్ఫ్‌ డ్రైవ్‌ కారు పరిశ్రమకు ఊతమిస్తుందనేది రేవ్‌ కో–ఫౌండర్‌ కరణ్‌ జైన్  మాట. ప్రస్తుతం దేశంలో మైల్స్, జూమ్‌కార్, కార్‌ క్లబ్, మైకార్, ఆటో రైడర్స్, ఈకో, రెంట్‌ ఏ కార్, లెట్‌ మి డ్రైవ్, జస్ట్‌ రైడ్, రేవ్, ఓలర్, డ్రివెన్  వంటి సంస్థలు బైకులు, కార్లు, సైకిళ్లను అద్దెకిస్తున్నాయి. నానో నుంచి మొదలుపెడితే స్విఫ్ట్, హోండా, ఆడి, ఫోర్డ్, బెంజ్, ఫార్చునర్, డస్టర్‌ వాహనాలన్నీ అద్దెకు తీసుకోవచ్చు. ధరలు రోజుకు సెడన్  వాహనాలైతే రూ.2,000–2,500, ఎస్‌యూవీ రూ.3,000–4,000 వరకున్నాయి. 25 ఏళ్ల వయస్సు, డ్రైవింగ్‌ లైసెన్స్ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు ఉన్నవారే కారు అద్దెకు తీసుకోవటానికి అర్హులు.

వీల్‌స్ట్రీట్‌లో బైక్స్‌..
గేర్, గేర్‌లెస్‌ ద్విచక్ర వాహనాలను మాత్రమే అద్దెకివ్వటం వీల్‌స్ట్రీట్‌ ప్రత్యేకత. అపాచి, షైన్, యాక్టివా, జూపిటర్, కరిజ్మా, ట్రయంప్, యమహా, హార్లే డేవిడ్‌సన్ , సుజుకీ హయాబుసా, నింజా, హ్యోసంగ్‌ వంటి 50కి పైగా సూపర్‌ బైక్స్‌ ఉన్నాయి. బైకు అద్దె రోజుకు ప్రారంభ ధర రూ.300. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, పుణె, ముంబై నగరాల్లో సేవలందిస్తున్నామని నెలకు 1000 బుకింగ్స్‌ అవుతున్నాయని వీల్‌స్ట్రీట్‌ కో–ఫౌండర్‌ మోక్షా శ్రీవాస్తవ చెప్పారు. సొంత వాహనాలతో పాటు డీలర్ల నుంచి, బైక్‌ ఓనర్ల నుంచి లీజు రూపంలో బైకులను అద్దెకు తీసుకుంటామని, ఇటీవలే ఆర్‌అండ్‌బీ పార్టనర్స్‌ నుంచి రూ.10 లక్షల నిధులను సమీకరించామని చెప్పారు.

వస్తువులే కాదు ఉద్యోగులు కూడా..
వస్తువులే కాదు నిపుణులను కూడా అద్దెకిచ్చే సంస్థ ఒకటుంది. అదే డెవలపర్‌ ఆన్  రెంట్‌. ఇది రిటైల్, ఈ–కామర్స్, హెల్త్‌కేర్, టెలికం, రియల్‌ ఎస్టేట్, ట్రావెల్, అగ్రికల్చర్, ఆటోమొబైల్స్, ఎడ్యుకేషన్ వంటి అన్ని రంగాల్లో నిపుణులను అద్దెకిస్తుంది. పీహెచ్‌పీ, పైథాన్, ఆండ్రాయిడ్, ఐఓఎస్, యాంగ్లర్‌ జేఎస్, మీన్  స్టాక్, ఫుల్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్, హెచ్‌టీఎంఎల్‌ 5, ఐఓటీ, మాజెంటో, వర్డ్‌ ప్రాసెస్‌ వంటి అన్ని రకాల టెక్నాలజీల్లోనూ వీరు సేవలందిస్తారని సంస్థ ఫౌండర్‌ కపిల్‌ మెహతా తెలిపారు. ఇప్పటివరకు జస్ట్‌ డయల్, శుభ్‌కార్ట్, ఆటోమోబీ, స్కిల్‌ స్పీడ్, పిట్టిగ్రూప్, స్లాటర్‌ కన్సల్టింగ్, సెంతిక్‌ వంటి 50కి పైగా కంపెనీలు మా నిపుణుల్ని అద్దెకు తీసుకున్నాయని పేర్కొన్నారు. అనుభవం, పని కాలం ప్రాతిపదికన చెల్లింపులుంటాయి.

రూ.10,200 కోట్లకు అద్దె పరిశ్రమ..
ప్రస్తుతం దేశంలో 300 వరకు ప్రధానమైన ఆన్ లైన్  రెంటల్‌ కంపెనీలున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా షేరింగ్‌ ఎకానమీ రూ.7,82,000 కోట్లుగా ఉందని.. 2025 నాటికి ఇది రూ.22,78,000 కోట్లకు చేరుతుందని ప్రైస్‌వాటర్‌ హౌజ్‌ కూపర్స్‌ తాజా నివేదికలో వెల్లడించింది.  మన దేశంలో విభాగాల వారీగా అద్దె విపణి గణాంకాలను పరిశీలిస్తే.. ఫర్నిచర్‌ రూ.5,400 కోట్లు, ఎలక్ట్రానిక్‌ అప్లయెన్సెస్‌ రూ. 3,400 కోట్లు, కార్లు, బైకుల మార్కెట్‌ రూ. 2,040 కోట్లు, బొమ్మలు రూ.800 కోట్లుగా ఉంటుందని తెలిపింది. మొత్తంగా మన దేశంలో అద్దె విపణి రూ.10,200 కోట్లుగా ఉందని నివేదిక పేర్కొంది.

నిధుల సమీకరణలోనూ జోరే..
నిధుల సమీకరణలోనూ రెంటల్‌ కంపెనీలు జోరుమీదున్నాయి. ముంబై కేంద్రంగా పనిచేసే ఫర్నిచర్‌ రెంటల్‌ సంస్థ ఫ్లైరోబ్‌ రెండు రౌండ్లలో 46 మిలియ న్ డాలర్లు సమీకరించింది. సెకోయా క్యాపిటల్, ఐడీజీ వెంచర్స్, జీఆర్‌ఈఈ వెంచర్స్‌తో పాటూ మరో ఇద్దరు ఇన్వెస్టర్లు ఈ పెట్టుబడి పెట్టారు. మరో ఫర్నిచర్‌ కంపెనీ రెన్ టొమొజో.. ఐడీజీ వెంచర్స్, యాక్సెల్‌ పార్టనర్స్‌ నుంచి గతేడాది నవంబర్‌లో 2 మిలియన్ డాలర్లను, ఫ్యూర్లెన్ కో సంస్థ లైట్‌బాక్స్‌ వెంచర్స్‌ నుంచి 6 మిలియన్  డాలర్లను సేకరించాయి. సెల్ఫ్‌ డ్రైవ్‌ కార్‌ పరిశ్రమలో 70 శాతం మార్కెట్‌ను సొంతం చేసుకున్న జూమ్‌కార్‌ ఇప్పటివరకు 45 మిలియన్  డాలర్ల నిధులను సమీకరించింది. కి.మీ. చొప్పున కాకుండా గంటల వారీగా కార్లను అద్దెకిచ్చే రేవ్‌ సంస్థలో మెకెన్సీ సంస్థకు చెందిన పలువురు 1.5 మిలియన్  డాలర్ల పెట్టుబడులు పెట్టారు. అయితే అమెరికా, చైనా వంటి దేశాలతో పోలిస్తే మన దేశంలో అద్దె మార్కెట్‌ ఇంకా ప్రారంభ దశలోనే ఉందన్నది విశ్లేషకుల మాట.
– సాక్షి పర్సనల్‌ ఫైనాన్స్  విభాగం

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా