కేంద్ర మంత్రులతో ఈ-కామర్స్ దిగ్గజాల భేటీ

12 Nov, 2014 01:52 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా ఈ-కామర్స్ పరిశ్రమ శరవేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజాలు ఈబే, అమెజాన్ భారతీయ విభాగాధిపతులు మంగళవారం కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం అయిన ఈబే ఇండియా ఎండీ లతీఫ్ నథానీ దేశీయంగా ఈ-కామర్స్ వృద్ధి అవకాశాలపై చర్చించారు. ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని లతీఫ్ తెలిపారు. భారత్‌లో తొమ్మిదేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న తమ సంస్థ గురించి, ఈకామర్స్ వృద్ధి అవకాశాల గురించి మంత్రికి వివరించినట్లు ఆయన వివరించారు.

 కిరాణా దుకాణాలతో అమెజాన్ భాగస్వామ్యం
 మరోవైపు అమెజాన్ ఇండియా ఎండీ అమిత్ అగర్వాల్ తదితరులు.. కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్‌తో భేటీ అయ్యారు. స్థానిక కిరాణా దుకాణాలను కూడా తమ నెట్‌వర్క్‌లో భాగస్వాములను చేసుకునేలా ప్రత్యేక వ్యవస్థకు రూపకల్పన చేస్తున్నట్లు మంత్రికి అమిత్ వివరించారు.

మరిన్ని వార్తలు