కొచ్చర్‌కు మరో షాక్‌!

3 Apr, 2018 17:43 IST|Sakshi

సాక్షి,ముంబై: వీడియోకాన్‌  రుణ వ్యవహారంలో ఐసీఐసీఐ  బ్యాంకు  సీఈవో చందా కొచ్చర్‌ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకవైపు ఐసీఐసీఐ బోర్డు  చందా కొచ్చర్‌కు   బాసటగా నిలుస్తుండగా.. దర్యాప్తు సంస్థలు మాత్రం వేగంగా కదులుతున్నాయి.  తాజాగా చందాకొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌కు చెందిన నూపవర్‌ రెన్యువబుల్స్‌ కంపెనీకి ఆదాయపన్ను శాఖ  మంగళవారం నోటీసులు జారీ చేసింది.  ఐటీ చట్టం సెక్షన్‌131 కింద కంపెనీ ఆస్తులను, ఆదాయం, చెల్లించిన పన్నులు తదితర  వివరాలను ఐటీ శాఖ పరిశీలించనుంది. 

ఈ వ్యవహారంలో ఇప్పటికే దీపక్‌ కొచ్చర్‌, వీడియోకాన్ గ్రూపు చైర్మన్ వేణుగోపాల్ ధూత్‌పై ప్రాథమిక విచారణను సీబీఐ ప్రారంభించింది. వీడియోకాన్ గ్రూపునకు 2012లో అక్రమంగా రూ.3,250 కోట్ల రుణ మంజూరు వ్యవహారంలో క్విడ్ ప్రోకో ఏమైనా జరిగిందా అనేది ఆరా తీస్తోంది. ఈ ప్రాథమిక విచారణలో భాగంగా సీబీఐ ఇప్పటికే పలువురు ఐసీఐసీఐ బ్యాంకు అధికారులను ప్రశ్నించడంతో పాటు ఆ రుణ లావాదేవీకి సంబంధించిన  పత్రాలను స్వాధీనం చేసుకుంది. 

కాగా ఐసీఐసీఐ బ్యాంకు నుంచి వీడియోకాన్‌ రుణ లావాదేవీ ద్వారా చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ ప్రయోజనాలు పొందినట్లుగా  ఆరోపణలపై  సీబీఐ రంగంలోకి దిగింది.  రుణాన్ని పొందిన వీడియోకాన్ గ్రూపు అందుకు ప్రతిఫలంగా దీపక్ కొచ్చర్ ఆధీనంలోని నూపవర్ రెన్యువబుల్స్ అనే పవన విద్యుత్ సంస్థలో పెట్టుబడులు పెట్టిందనీ, వీడియోకాన్ గ్రూపునకు రుణాలను మంజూరు చేసిన కమిటీలో  చందా కొచ్చర్ ఉన్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు  క్విడ్ ప్రోకో జరగలేదంటూ ఈ ఆరోపణలను  వీడియోకాన్  చైర్మన్‌ ధూత్‌ తోసిపుచ్చిన సంగతి విదితమే..

మరిన్ని వార్తలు