ఐటీ షేర్లకు ట్రంప్ షాక్ : రికవరీ

23 Jun, 2020 14:18 IST|Sakshi

సాక్షి, ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్క్ వీసాలపై సంచలన నిర్ణయం తీసుకోవడంతో మంగళవారం నాటి మార్కెట్లో ఐటీ షేర్లకు అమ్మకాల సెగ తాకింది. 2020, డిసెంబర్ 31వరకు హెచ్1బీ, హెచ్ 2బీ, తదితర వర్క్ వీసాల జారీని ట్రంప్ సర్కార్ నిలిపివేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు దెబ్బతింది. దీంతో టాప్ ఐటీ షేర్లతో పాటు  మిగిలిన ఐటీ షేర్లలో  కూడా అమ్మకాల ఒత్తిడి నెలకొంది.  ప్రధానంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్  భారీగా నష్టాలను నమోదు చేశాయి. 

ఇన్ఫోసిస్ షేర్ ధర 1శాతం పైగా కోల్పోయి 692 రూపాయల వద్ద,  హెచ్‌ఎస్‌ఎల్  దాదాపు 1 శాతం తగ్గి 564 రూపాయలకు చేరుకుంది. టీసీఎస్ షేర్ అంతకుముందు ముగింపు 2028 రూపాయలతో పోలిస్తే 2010 వద్ద ట్రేడ్ అయింది.  టెక్ మహీంద్రా షేర్ ధర 0.92 శాతం క్షీణించి 543.50 రూపాయలకు చేరుకుంది. అయితే దీని ప్రభావం తాత్కాలికమేనని, భారతీయ ఐటీ ఉద్యోగులు లేకుండా అమెరికా ఐటీ పరిశ్రమ మనుగడ కష్టమని ఐటీ నిపుణులు భరోసా ఇవ్వడంతో తిరిగి అదే స్థాయిలో రీబౌండ్ అయ్యాయి. దీంతో మిడ్ సెషన్ తరువాత కోలుకుని ప్రస్తుతం లాభాలతో కొనసాగుతుండటం విశేషం. అటు సెన్సెక్స్ 351 పాయింట్ల లాభంతో 35263 వద్ద,  నిఫ్టీ 108 పాయింట్లు ఎగిసి 10421 వద్ద కొనసాగుతున్నాయి.  (ట్రిపుల్ సెంచరీ లాభాలతో సెన్సెక్స్)

ఐటీ నిపుణులు, విశ్లేషకులు ఏమన్నారు
ట్రంప్ సర్కార్ నిర్ణయం భారతీయ ఐటీ కంపెనీల కంటే అమెరికా కంపెనీలనే ఎక్కువగా ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2019లో హెచ్ 1బీ వీసాలు పొందిన మొదటి పది కంపెనీల్లో ఏడు అమెరికా కంపెనీలే ఉన్నాయని ఒక నివేదిక ద్వారా తెలుస్తోంది. అంతేకాదు హెచ్1బీ వీసాలపై ఆధారపడటం ఐటీ పరిశ్రమలో గణనీయంగా తగ్గిందని వెడ్ బుష్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ మోషే కత్రి చెప్పారు. దురదృష్టవశాత్తు అమెరికాలో ఎన్నికల సంవత్సరంలో ఇదొక ఎత్తుగడ అని వ్యాఖ్యానించారు. ఇమ్మిగ్రేషన్ సవాళ్లకు భారత ఐటీ పరిశ్రమ ఇప్పటికే తనను తాను సిద్ధం చేసుకుందని టెక్ మహీంద్రా సీఎండీ సీపీ గుర్నాని చెప్పారు.

ట్రంప్ ప్రకటనపై నిరాశను వ్యక్తం చేసిన గూగుల్, అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్, అటు అమెరికా ఆర్థిక విజయానికి, టెక్ రంగలో గ్లోబల్ లీడర్‌గా నిలిచేందుకు, ఇటు గూగుల్ సంస్థకూ వలసదారులు ఎంతో దోహదపడ్డారని  పేర్కొన్నారు.  అందరికీ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తాం, వలసదారులకు అండగా వుంటామని భరోసా ఇస్తూ ట్వీట్  చేశారు. 

మరోవైపు వరుసగా రెండో రోజూ రూపాయి లాభాలతో ప్రారంభమైంది. డాలర్‌తో పోలిస్తే 16 పైసలు బలపడి 75.86 వద్ద  ట్రేడ్ అయింది. చివరకు  37 పైసలు ఎగిసి 75.66 వద్ద ముగిసింది. నిన్న (సోమవారం) 76.02 వద్ద ముగిసింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా