ఐటీలో కొత్త కెరటాలు!

15 Nov, 2017 00:43 IST|Sakshi

వేగంగా అడుగులేస్తున్న మధ్యస్థాయి కంపెనీలు

లాభం, ఆదాయంలో దిగ్గజాలను మించి వృద్ధి

ఎల్‌అండ్‌టీ ఇన్ఫో, హెక్సావేర్, సైయంట్‌ల తీరు

డిజిటల్‌పై దృష్టి పెట్టడమే ప్రధాన కారణం!!

వీటిని డార్క్‌ హార్స్‌లుగా అభివర్ణిస్తున్న విశ్లేషకులు  

న్యూఢిల్లీ: భారత ఐటీ రంగం వేగంగా మారుతోంది. దిగ్గజాలు ఆపసోపాలు పడుతుండగా... ఐటీ రంగంలో కొత్త ఆశాకిరణాలుగా మధ్య స్థాయి కంపెనీలు దూసుకొస్తున్నాయి. దిగ్గజ సంస్థలు వ్యాపార వృద్ధిలో సింగిల్‌ డిజిట్‌ వృద్ధిని నమోదు చేయడానికే నానా తంటాలూ పడుతున్నాయి. కానీ, ఇదే రంగంలోని మధ్య స్థాయి సంస్థలు మాత్రం వేగంగా అడుగులు వేస్తున్నాయి.

టాప్‌ కంపెనీలకు మించి ఆదాయం, లాభాల్లో బలమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయి. భవిష్యత్‌ లీడర్లుగా, డార్క్‌ హార్స్‌లుగా ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్, హెక్సావేర్‌ టెక్నాలజీస్, మైండ్‌ట్రీ కంపెనీలను విశ్లేషకులు వర్ణిస్తున్నారు. టాప్‌ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌ గత కొన్ని త్రైమాసికాలుగా ఆదాయం, లాభాల్లో ఒకే అంకె వృద్ధికి పరిమితమయ్యాయని వాటి ఫలితాలను పరిశీలిస్తే తెలుస్తుంది.

బొమ్మ– బొరుసు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాల (ఏప్రిల్‌–జూన్, జూలై–సెప్టెంబర్‌) కాలంలో బలమైన వృద్ధిని నమోదు చేసిన హెక్సావేర్‌ టెక్నాలజీస్‌... 2017 సంవత్సరానికి డాలర్‌ ఆదాయం వృద్ధి అంచనాలను 14– 15%కి పెంచడం విశేషం. అంతక్రితం ఈ అంచనాలు 10–12 శాతమే. ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ మిడ్‌సైజు కంపెనీల్లో 1.1 బిలియన్‌ డాలర్ల ఆదాయంతో అతిపెద్ద కంపెనీగా ఉంది. సెప్టెంబర్‌ క్వార్టర్లో స్థిరమైన వృద్ధిని ప్రదర్శించింది.

అధిక ఆన్‌షోర్, ఆఫ్‌షోర్‌ వ్యాల్యూమ్‌ అండతో 270.6 మిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. కానీ, ఇన్ఫోసిస్‌ విషయం మాత్రం భిన్నం. 2017–18 ఆర్థిక సంవత్సరానికి తన వృద్ధి అంచనాలను ఏకంగా 2 శాతం తగ్గించింది. విప్రో సైతం త్రైమాసిక వారీ అంచనాల పట్ల అప్రమత్తత వ్యక్తం చేసింది. ఐటీ కంపెనీ సంఘమైన నాస్కామ్‌ కూడా ఈ ఏడాది ఐటీ ఎగుమతులు 7–8 శాతంగా ఉండొచ్చని ప్రకటించింది. దీంతో ఐటీ రంగం మరో ఏడాది కూడా ఒకే అంకె వృద్ధికి పరిమితం కానుంది.

డిజిటల్‌ దన్ను...  
‘‘మధ్య స్థాయి ఐటీ కంపెనీల్లో హెక్సావేర్, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్, సైయంట్‌ తదితర సంస్థలు భారీ కంపెనీల కంటే అధిక వృద్ధిని సాధిస్తున్నాయి. డిజిటల్‌ విధానాలపై దృష్టి సారిస్తూ డిజిటల్‌ టెక్నాలజీ పరంగా ఒప్పందాలను దక్కించుకుంటున్నాయి. వీటి వృద్ధి అవకాశాలు వాటి  షేర్ల ధరల ప్రీమియం రూపంలో ప్రతిఫలిస్తున్నాయి’’ అని ప్రభుదాస్‌ లీలాధర్‌ అనలిస్ట్‌ మధుబాబు పేర్కొన్నారు.

స్వతహాగా వచ్చే సాఫ్ట్‌వేర్‌ సర్వీసుల కాంట్రాక్టులు తగ్గిపోయే ప్రభావం పెద్ద, మధ్య స్థాయి కంపెనీలపై మిశ్రమంగా ఉంది. ఒకవైపు సాఫ్ట్‌వేర్‌ నిర్వహణ వంటి సంప్రదాయ సేవల ప్రాధాన్యత గణనీయంగా తగ్గిపోతుంటే, మరోవైపు డిజటల్‌ టెక్నాలజీ సేవలు ఇంకా సంప్రదాయ సేవల వాటా స్థాయికి చేరకపోవడం కంపెనీల వృద్ధి అవకాశాలను పరిమితం చేస్తోందంటున్నారు విశ్లేషకులు. అయితే, మధ్య స్థాయి ఐటీ కంపెనీలు మాత్రం డిజిటల్‌ కాంట్రాక్టుల విషయంలో పెద్ద కంపెనీలతో పోలిస్తే మెరుగ్గానే ఉన్నాయి.

ఇవి డిజిటల్‌పై తమ ఫోకస్‌ పెట్టడంతో అధిక వృద్ధికి అవకాశాలను కల్పిస్తోంది. హెక్సావేర్‌ విధానాన్నే పరిశీలించి చూస్తే ఈ కంపెనీ ఆటోమేషన్‌ను ఉపయోగిస్తూ కొత్త కాంట్రాక్టులను సంపాదిస్తోంది. అదే సమయంలో ఈ రంగంలోని ఇతర మధ్య స్థాయి కంపెనీలైన మైండ్‌ట్రీ, కేపీఐటీ టెక్నాలజీస్‌ మాత్రం సంప్రదాయ విభాగాలపైనే ఇప్పటికీ ఆధారపడి కొనసాగుతున్నాయి. దీంతో పరిశ్రమలో ఉన్న వృద్ధి మందగమన ప్రభావం వాటి ఫలితాల్లో కనిపిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.


చిన్న కాంట్రాక్టులతో మొదలుపెట్టి...
మధ్య స్థాయి ఐటీ కంపెనీలు డిజిటల్‌ టెక్నాలజీ రంగంలో రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ తదితర విభాగాల్లో బలమైన వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి.

ప్రారంభంలో ఇవి 2,00,000 డాలర్ల విలువైన చిన్న ప్రాజెక్టులను స్వీకరించడం ద్వారా డిజిటల్‌ టెక్నాలజీ విభాగంలో తమ సామర్థ్యాలను బలోపేతం చేసుకున్నాయి. వీటి ఫలితంగా ఆయా విభాగాల్లో నైపుణ్యాలకు తగిన కాంట్రాక్టులను సంపాదిస్తున్నాయి. పెద్ద కంపెనీల దృష్టంతా ప్రధానంగా భారీ కాంట్రాక్టులపైనే ఉంది.
– మలయ్‌షా, అల్వారెజ్‌ అండ్‌ మార్సల్‌ ఇండియా సీనియర్‌ డైరెక్టర్‌ 

మరిన్ని వార్తలు