జీఎస్‌టీ ఎఫెక్ట్‌.. ఆఫర్లే.. ఆఫర్లు..!

13 Jun, 2017 00:14 IST|Sakshi
జీఎస్‌టీ ఎఫెక్ట్‌.. ఆఫర్లే.. ఆఫర్లు..!

తెర తీసిన రిటైలర్లు
టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లపై డిస్కౌంట్లు
20–40 శాతం వరకు తగ్గింపు


కన్సూమర్లకు ఏడాది మధ్యలోనే దీపావళీ వచ్చేసింది. జీఎస్‌టీ అమలుకు ముందే పాత సరుకును విక్రయించుకోవడానికి రిటైలర్లు భారీ డిస్కౌంట్లకు తెరతీశారు. ఖరీదైన గృహోపకరణాలు తక్కువ ధరలకే అందుబాటులోకి వస్తున్నాయి. దాదాపు 20–40 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల విక్రయదారులు వారి సరుకును జూలై 1 నాటికి పూర్తిగా అమ్మేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తేదీ నుంచి వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమల్లోకి వస్తోంది. జీఎస్‌టీ వల్ల ఈ రిటైలర్లకు నష్టాలు రావొచ్చు. అందుకే ఈ నష్టాలను తగ్గించుకునేందుకు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించి సరుకును ఖాళీ చేసుకోవాలని చూస్తున్నారు.

టీవీలు, రిఫ్రిజిరేటర్లపై భలే డిస్కౌంట్లు
టెలివిజన్‌ సెట్స్, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండీషనర్లు (ఏసీలు), వాషింగ్‌ మెషీన్లపై రిటైల్‌ చైన్స్‌ డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తున్నాయి. దీంతో వీటి ధరలు తగ్గాయి. డిస్కౌంట్‌ అనేది సరుకు, విక్రయించే రిటైలర్‌పై ఆధారపడి ఉంటుంది. రిటైలర్లు ఒక వస్తు రిటైల్‌ ధరపై సాధారణంగా 10–15% డిస్కౌంట్‌ ఇస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ డిస్కౌంట్‌ గరిష్టంగా మూడు రెట్లు పెరగొచ్చు. ముంబైకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ రిటైల్‌ చైన్‌ కోహినూర్‌.. డిస్‌ప్లేలో ఉంచిన ప్రొడక్టులపై 40% వరకు డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది. వీటిల్లో ఎక్కువ సెల్‌ఫోన్లే.

దిగ్గజ కంపెనీల ఆఫర్లు
శాంసంగ్, పానాసోనిక్, హిటాచి, వీడియోకాన్‌ వంటి సంస్థలు కూడా కన్సూమర్‌ ప్రమోషనల్‌ ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. గిఫ్ట్స్, వారంటీ పొడిగింపును అందిస్తున్నాయి. రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్లు కొత్త సరుకును తీసుకెళ్లడం నిలిపివేసిన దగ్గరి నుంచి కంపెనీలు ఈ ఆఫర్లకు శ్రీకారం చుట్టాయి. కాగా రిటైలర్లు కొత్త సురుకు కొనుగోలుపై కాకుండా వారి దగ్గర ఉన్న పాత సరుకును పూర్తిగా విక్రయించడంపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించారని పరిశ్రమకు చెందిన ఇద్దరు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్స్‌ తెలిపారు.

6–14 శాతం నష్టాలు!!
డిస్కౌంట్ల కారణంగా 6–14 శాతంమేర నష్టాలు రావొచ్చని రిటైలర్లు అభిప్రాయపడుతున్నారు. మే నెలకు ముందు కొనుగోలు చేసి ఇంకా విక్రయించని వస్తువులపై దాదాపు 6 శాతం వరకు నష్టాలు రావొచ్చని వాపోతున్నారు. ఇక ఏడాది పాత సరుకుపై 14 శాతం వరకు నష్టాలు తప్పవని తెలిపారు.  ‘రిటైలర్లు వారి స్టాక్‌ మొత్తాన్ని నగదులోకి మార్చుకోవాలని భావిస్తున్నారు. వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ 40 శాతం సెంట్రల్‌ జీఎస్‌టీని భరించడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే విక్రయించని ఉత్పత్తులపై వీరికి క్రెడిట్‌ ప్రయోజనం లభించదు’ అని ప్రముఖ ఎలక్ట్రికల్‌ గూడ్స్‌ రిటైలర్‌ సంస్థ గ్రేట్‌ ఈస్ట్రన్‌ డైరెక్టర్, పుల్కిత్‌ బైద్‌ తెలిపారు.

రూ.100 కోట్ల పాత సరుకు...  
పలు లార్జ్‌ కన్సూమర్‌ ఎలక్ట్రానిక్‌ రిటైలర్‌ చైన్స్‌ రూ.100 కోట్లకుపైగా చొప్పున పాత సరుకును కలిగి ఉన్నాయని పరిశ్రమ నిపుణుల పేర్కొంటున్నారు. దీంతో ఆయా రిటైలర్ల మార్జిన్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. రిటైలర్లు‡ జూలై నాటికి సాధ్యమైనంత తక్కువ సరుకును ఉండేలా చూసుకుంటున్నారని విజయ్‌ సేల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నీలేశ్‌ గుప్తా తెలిపారు. డిస్కౌంట్ల రూపంలో వస్తువులను విక్రయించడం వల్ల నష్టాలు తప్పవని పేర్కొన్నారు. ముందస్తు డిస్కౌంట్ల కారణంగా జూలై విక్రయాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని తెలిపారు.

ఇన్‌పుట్‌ క్రెడిట్‌ 60 శాతానికి పెంపు
జీఎస్‌టీ కౌన్సిల్‌ జూన్‌ 3 నాటి సమావేశంలో 18 లేదా అంతకన్నా ఎక్కువ జీఎస్‌టీ పన్ను స్లాబ్‌లోని ప్రొడక్టులపై ఇన్‌పుట్‌ క్రెడిట్‌ను 40 నుంచి 60 శాతానికి పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది. కన్సూమర్‌ గూడ్స్, ఎలక్ట్రికల్‌ అప్లయెన్సెస్‌ వంటివి 28% పన్ను స్లాబ్‌ కిందకు వస్తాయి. అలాగే రూ.25,000కుపైగా విలువైన ప్రొడక్టుల విషయంలో ట్రాకింగ్‌ ఆధారంగా 100% క్రెడిట్‌ను కూడా కౌన్సిల్‌ ప్రతిపాదించింది. అయితే ఇక్కడ ట్రాకింగ్‌ అంశంపై స్పష్టత రావాలి. ‘పరిశ్రమకు 100% క్రెడిట్‌ బెనిఫిట్‌ అందితే 25 % స్టాక్‌ను కవర్‌ అయిపోతుంది. ఇక  మిగిలిన 75% సరుకును విక్రయించాల్సి ఉంటుంది’ అని గోద్రేజ్‌ అప్లయెన్సెస్‌ బిజినెస్‌ హెడ్‌ కమల్‌ తెలిపారు. కాగా జీఎస్‌టీతో కన్సూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ ధరలు 3–5 %మేర పెరగనున్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా