ఐట్యూన్స్, గ్యాస్, డౌన్‌లోడ్..!

12 Oct, 2015 00:53 IST|Sakshi
ఐట్యూన్స్, గ్యాస్, డౌన్‌లోడ్..!

స్విస్ బ్యాంకుల్లో లావాదేవీలకు రహస్య సంకేతాలు ఇవి...
జ్యూరిక్: కాదేదీ ‘కోడ్’కు అనర్హం అంటే ఇదేనేమో! ఇంతకీ దేనికంటారా.. స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచుకునేవాళ్లకు రహస్య సంకేతాల్లో ట్రెండ్ ఇది. అంతర్జాతీయంగా వివిధ దేశాలు నల్లధనంపై కొరడా ఝుళిపిస్తుండటంతో స్విస్ బ్యాంకులు తమ గుట్టును విప్పాల్సి వస్తోంది. కేవలం ఖాతాల వివరాలను రహస్యంగా ఉంచుకోవడానికి మాత్రమే కోడ్‌లను వినియోగిస్తుంటారనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసిన విషయం.

అయితే, అక్కడి బ్యాంకర్లకు క్లయింట్లకు మధ్య జరిగే ప్రతి ఒక్క లావాదేవీకి కూడా ఒక రహస్య సంకేతం ఉంటుందన్న విషయం ఇటీవలే బయటికొచ్చింది. అమెరికా పన్ను శాఖలతో పలు స్విస్ బ్యాంకులు చేసుకున్న సెటిల్‌మెంట్ ఒప్పందం ప్రకారం ఖాతాలకు చెందిన అనేక వివరాలను ఆయా బ్యాంకులు తెలియజేశాయి.

ఇందులో కోడ్‌లకు సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలు బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా స్విస్ బ్యాంక్ క్లయింట్లు తమ ఖాతాల నుంచి సొమ్మును ట్రాన్స్‌ఫర్ చేయాలని చెప్పడానికి ‘డౌన్‌లోడ్’ అనే కోడ్‌ను ఉపయోగించాల్సి ఉంటుందట! అదేవిధంగా నిధులను డ్రా చేసుకోవాలంటే చెప్పాల్సిన రహస్య సంకేతాల్లో ‘ఐట్యూన్స్’, ‘గ్యాస్’ వంటివి ఉన్నాయి.
 
బ్లాక్ మనీపై భారత్ సహా అనేక దేశాలు ఇటీవల పెద్దయెత్తున ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో స్విస్ బ్యాంకులు రహస్య ఖాతాల గుట్టును విప్పాల్సి వస్తోంది. అయితే, తాజా కోడ్‌లను పరిశీలిస్తే.. ఇప్పటికే స్విస్ బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో నిధులు సింగపూర్, ఇజ్రాయెల్, సైప్రస్, లెబనాన్, హాంకాంగ్, దుబాయ్ వంటి దేశాలకు తరలిపోయిందన్న విషయం తేటతెల్లమవుతోంది. యూఎస్ న్యాయ శాఖకు వివిధ స్విస్ బ్యాంకులు ఇచ్చిన ‘స్టేట్‌మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్’ నివేదిక దీన్ని బయటపెట్టింది.

తమ క్లయింట్లు నల్లధనాన్ని దాచుకోవడానికి వివిధ దేశాల్లో దొంగ సంస్థలను రిజిస్టర్ చేసుకోవడానికి, బోగస్ బీమా పథకాలను సృష్టించడంలో ఎలా తోడ్పాటునందించిందీ కూడా బ్యాంకులు ఆ నివేదికలో వెల్లడించాయి. భారీస్థాయి(హై ప్రొఫైల్) ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ ఈవెంట్లకు హాజరయ్యే సంపన్నులను తమ నల్లధనాన్ని సురక్షితంగా ఎలా దాచుకోవచ్చో వివరించేందుకు స్విస్ బ్యాంకులు ప్రత్యేకంగా రిలేషన్‌షిప్ మేనేజర్లను రంగంలోకి దించేవన్న సంగతి కూడా తాజాగా బట్టబయలైంది.

>
మరిన్ని వార్తలు