జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ కార్ల ధరలు కట్‌

30 May, 2017 23:54 IST|Sakshi
జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ కార్ల ధరలు కట్‌

జీఎస్‌టీ ప్రభావంతో రూ. 11 లక్షల దాకా తగ్గుదల
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం కింద తగ్గే పన్ను రేట్ల ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించనున్నట్లు ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌లో భాగమైన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ వెల్లడించింది. ఎంపిక చేసిన మోడల్స్‌పై రూ. 10.9 లక్షల దాకా రేటును తగ్గిస్తున్నట్లు తెలిపింది. దీని ప్రకారం జాగ్వార్‌ ఎక్స్‌ఈ సెడాన్‌ ధర రూ. 2 లక్షల నుంచి రూ. 5.7 లక్షల దాకా, జాగ్వార్‌ ఎక్స్‌జే రేటు రూ. 4 లక్షల నుంచి రూ. 10.9 లక్షల దాకా తగ్గుతాయి. అలాగే ల్యాండ్‌ రోవర్‌ మోడల్స్‌ అయిన డిస్కవరీ స్పోర్ట్, రేంజ్‌ రోవర్‌ ఎవోక్‌లపై ధరలు రూ. 3.3 లక్షలు–రూ. 7.5 లక్షల దాకా తగ్గుతాయి.

రాష్ట్రాలవారీగా రేట్లపరమైన ప్రయోజనాలు మారతాయని సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఈ మోడల్స్‌ ధరలు రూ. 37.25 లక్షల నుంచి రూ. 1.02 కోట్ల దాకా (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ) ఉన్నాయి. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే రేట్ల తగ్గుదల 12 శాతం దాకా ఉండగలదని కంపెనీ తెలిపింది. తక్షణ ప్రభావంతో తాము రేట్ల తగ్గుదల ప్రయోజనాలు అందిస్తున్నామని, ఒకవేళ జూలై 1 నుంచి జీఎస్‌టీ గానీ అమల్లోకి రాని పక్షంలో తగ్గిన ధరలు జూన్‌కి మాత్రమే వర్తిస్తాయని పేర్కొంది. ప్రస్తుత విధానంతో పోలిస్తే జీఎస్‌టీలో తక్కువ పన్ను శ్లాబ్‌ కారణంగా పెద్ద కార్ల ధరలు తగ్గనున్నాయి. ఈ నేపథ్యంలో ఫోర్డ్‌ ఇండియా ఇప్పటికే తమ ఎస్‌యూవీ ఎకోస్పోర్ట్, సెడాన్‌ ఆస్పైర్, హ్యాచ్‌బ్యాక్‌ ఫిగోలపై రూ. 30,000 దాకా డిస్కౌంట్లు ప్రకటించింది. అటు జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థలు మెర్సిడెస్‌ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ సైతం ధరలు తగ్గించడం, తక్కువ వడ్డీ రేట్ల ప్రయోజనాలు మొదలైన ఆఫర్లు ప్రకటించాయి.

>
మరిన్ని వార్తలు