చైనా బ్యాంకర్లతో జైట్లీ సమావేశం

24 Jun, 2016 01:09 IST|Sakshi
చైనా బ్యాంకర్లతో జైట్లీ సమావేశం

బీజింగ్: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఐదు రోజుల చైనా పర్యటన గురువారం ప్రారంభమైంది. భారత మౌలిక వసతుల నిర్మాణంలోకి మరిన్ని విదేశీ నిధులు రాబట్టే దిశగా జైట్లీ తొలిరోజు చైనా అగ్రశ్రేణి బ్యాంకర్లు, ఫండ్ మేనేజర్లతో సంప్రదింపులు జరిపారు. బీజింగ్ చేరుకున్న ఆయన ముందుగా బ్యాంకు ఆఫ్ చైనా చైర్మన్ టియనా గులితో భేటీ అయ్యారు. సావరీన్ వెల్త్ ఫండ్ మేనేజర్లు, సంస్థాగత పెట్టుబడిదారులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలోనూ పాల్గొన్నారు.

 శుక్రవారం చైనా ప్రభుత్వ రంగ సంస్థల అధిపతులు, అక్కడి వ్యాపార వేత్తలతో జరగనున్న ‘ఇన్వెస్ట్ ఇన్ ఇండియా’ అనే వ్యాపార సదస్సులో జైట్లీ పాల్గొంటారు. అలాగే, ఈ నెల 25న మూడో రోజు ఆసియాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) బోర్డ్ గవర్నర్లతో సమావేశం అవుతారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మౌలికరంగ అభివృద్ధి కోసం ఏర్పాటైన ఏఐఐబీలో చైనా 26.6 శాతం వాటాతో అతిపెద్ద భాగస్వామిగా ఉండగా, 7.5 శాతం వాటాతో రెండో అతిపెద్ద భాగస్వామ్య దేశంగా భారత్ ఉంది. రష్యా 5.93 శాతం, జర్మనీ 4.5 శాతం వాటాలు కలిగి ఉన్నాయి.

57 దేశాలు వ్యవస్థాపక సభ్యదేశాలుగా చేరాయి. 25న జరిగే ఏఐఐబీ సమావేశంలో తొలి విడతగా పలు దేశాలకు రుణాల మంజూరును బ్యాంకు ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. 26న చైనా సహా పలు దేశాలకు చెందిన ఆర్థిక మంత్రులతో జరిగే ఓ అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో జైట్లీ పాల్గొననున్నారు. అలాగే, ఏఐఐబీ నిర్వహించే పర్యావరణ అనుకూల మౌలిక వసతులు అనే సదస్సులోనూ బ్రిక్స్ బ్యాంకు అధిపతి కేవీకామత్, ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య తదితరులతో కలసి పాల్గొననున్నారు. చివరిగా ఈ నెల 27న చైనా ఆర్థిక మంత్రి లూజివీతో జైట్లీ సమావేశమై రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారం సహా పలు అంశాలపై చర్చలు జరుపుతారు.

మరిన్ని వార్తలు