ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ ఇప్పుడు లేదు

8 Sep, 2016 01:24 IST|Sakshi
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ ఇప్పుడు లేదు

అందుకు భారత్ సిద్ధం కాలేదన్న జైట్లీ
వాటి ఆర్థిక పరిపుష్టే ధ్యేయమని ఉద్ఘాటన

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకుల ప్రైవేటీకరణకు భారత్ సిద్ధం కాలేదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. వాటికి మరింత మూల దనం కేటాయించి, ఆర్థికంగా పటిష్టం చేయడం ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కేటాయించిన రూ.25,000 కోట్ల నిధులు కాకుండా, అవసరమైతే మరిన్ని నిధులు సమకూర్చడానికి సిద్ధమని కూడా ఆర్థికమంత్రి అన్నారు.  ఇక ఐడీబీఐ బ్యాంక్ మినహా పీఎస్‌యూ బ్యాంకుల ప్రస్తుత పాత్ర, లక్షణాలు యథాతథంగా కొనసాగుతాయని అన్నారు. ‘‘కొన్ని బ్యాంకుల విలీనానికి ప్రయత్నం జరుగుతోంది. పోటీ పూర్వక పరిస్థితుల్లో ఇది తప్పదు. ఐడీబీఐ బ్యాంక్ విషయంలో మాత్రం వాటాను 49 శాతానికి తగ్గించుకోవడంపై మదింపు జరుగుతోంది’’ అని ఇక్కడ జరిగిన భారత్ ఎకనమిస్ట్ సదస్సులో జైట్లీ అన్నారు.

ఫైనాన్షియల్ విభాగంలో ప్రైవేటీకరణ ప్రక్రియ ఎందుకు జరగడం లేదన్న ప్రశ్నకు ఆర్థికమంత్రి సమాధానం చెబుతూ, ‘‘సంస్కరణలను ఒక స్థాయికి తీసుకువెళ్లే దశలో ప్రజాభిప్రాయాన్ని తగిన విధంగా మలచాల్సి ఉంటుంది. సామాజిక రంగం అభివృద్ధికి నిధుల కల్పనాంశాలపై దృష్టి సారించాలి. ఈ విభాగంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పాత్ర గణనీయమైనది. ఒకవేళ ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తే, ఆయా సామాజిక రంగానికి నిధుల కల్పన ఎలా అన్న అంశంపై ఏకాభిప్రాయ సాధన అవసరం. అయితే కొన్ని నిర్దిష్ట సంస్కరణలకు మాత్రం ప్రణాళిక రూపొందించాం. ఉదాహరణకు బ్యాంకుల్లో ప్రభుత్వ హోల్డింగ్‌ను 52 శాతానికి తీసుకురావడం’’ అని జైట్లీ పేర్కొన్నారు. ఇక మొండిబకాయిల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తగిన విస్తృత స్థాయి చర్యలను తీసుకుంటోందని జైట్లీ అన్నారు.

జీఎస్‌టీ అమలు తక్షణ లక్ష్యం...
వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు కేంద్రం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్న జైట్లీ, దీనివల్ల పన్ను రేట్లు దిగివస్తాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి జీఎస్‌టీ అమలుకు తగిన చర్యలు తీసుకుం టున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు