జనవరి నుంచి నెఫ్ట్‌ చార్జీలకు చెల్లు

9 Nov, 2019 06:14 IST|Sakshi

బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశం

ముంబై: వచ్చే జనవరి నుంచి సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాదారులు ‘నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌’ (నెఫ్ట్‌) లావాదేవీలపై ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆర్‌బీఐ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల మధ్య ఆన్‌లైన్‌ లావాదేవీలకు సంబంధించి నెఫ్ట్, ఆర్‌టీజీఎస్‌ అనే రెండు ముఖ్య విధానాలు అమల్లో ఉన్నాయి. ఈ రెండు వ్యవస్థలను ఆర్‌బీఐ నిర్వహిస్తుంటుంది. నెఫ్ట్‌ లావాదేవీలను బ్యాచ్‌ల వారీగా అరగంటకోసారి సెటిల్‌ చేస్తున్నారు. అదే ఆర్‌టీజీఎస్‌ అయితే ప్రతీ లావాదేవీ అప్పటికప్పుడే, విడిగా పూర్తి అవుతుంది.

‘‘దేశ పౌరులకు అసాధారణ చెల్లింపుల అనుభవాన్ని కలి్పంచేందుకు సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాదారుల నుంచి నెఫ్ట్‌ చార్జీలను 2020 జనవరి నుంచి వసూలు చేయరాదని బ్యాంకులను ఆదేశిస్తున్నాం’’ అని ఆర్‌బీఐ తన ప్రకటనలో పేర్కొంది. పార్కింగ్‌ ఫీజు, ఇంధనం నింపుకునే వద్ద చెల్లింపులకు సైతం ఫాస్టాగ్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలనే ప్రణాళికతో ఉన్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. డీమోనిటైజేషన్‌ జరిగి మూడేళ్లయిన సందర్భంగా ఆర్‌బీఐ ఈ నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతానికి రూ.10,000 విలువ వర కు నెఫ్ట్‌ లావాదేవీలపై రూ.2 చార్జీని,  అదనంగా జీఎస్‌టీని బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. రూ. 2లక్షల పైన ఉన్న లావాదేవీలపై ఎస్‌బీఐ రూ.20 చార్జీని, దీనిపై జీఎస్‌టీని వసూలు చేస్తోంది.

మరిన్ని వార్తలు