ఇక దేశవ్యాప్తంగా అంబికా అగర్‌బత్తీస్

25 Aug, 2015 01:15 IST|Sakshi
ఇక దేశవ్యాప్తంగా అంబికా అగర్‌బత్తీస్

బ్రాండ్ అంబాసిడర్‌గా జయప్రద
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
అగర్‌బత్తీల తయారీలో ఉన్న అంబికా దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా, పశ్చిమబెంగాల్‌లో అమ్మకాలను సాగిస్తున్న ఈ సంస్థ.. 2020 నాటికి అన్ని రాష్ట్రాల్లో అడుగు పెట్టాలని లక్ష్యంగా చేసుకుంది. ఇందులో భాగంగా సినీ నటి, రాజకీయ నాయకురాలు జయప్రదను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ.300 కోట్ల విలువైన అగర్‌బత్తీల విపణిలో వ్యవస్థీకృత రంగం వాటా రూ.200 కోట్లు. ఇందులో తమ కంపెనీ 60% వాటాతో అగ్ర స్థానాన్ని కొనసాగిస్తోందని అంబికా సీఎండీ అంబికా కృష్ణ సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు.
 
15-16లో రూ.180 కోట్లు..
గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.160 కోట్ల ఆదాయం ఆర్జించింది. 2015-16లో రూ.180 కోట్లు లక్ష్యంగా చేసుకుంది. రోజుకు 80 లక్షల అగర్‌బత్తీల తయారీ సామర్థ్యం ఉందని కంపెనీ డెరైక్టర్ అంబికా రామచంద్రరావు తెలిపారు. 100 రకాల పరిమళాలను సొంతంగా అభివృద్ధి చేశామన్నారు. అగర్‌బత్తీల తయారీకి కావాల్సిన వెదురును దేశీయ కంపెనీలు ఇండోనేషియా, చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. ప్రభుత్వ పాలసీల కారణంగా ఏటా రూ.400 కోట్ల విదేశీ మారక ద్రవ్యం కోల్పోతున్నామని అంబికా కృష్ణ అన్నారు. వెదురు చెట్ల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు. కాగా,  70వ వసంతంలోకి కంపెనీ అడుగు పెడుతున్న సందర్భంగా జయప్రదతో చిత్రీకరించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు.

మరిన్ని వార్తలు