ఆటో కన్నా విమాన చార్జీలే నయం..

4 Sep, 2018 13:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆటో చార్జీల కన్నా విమాన చార్జీలే చౌకగా ఉన్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మం‍త్రి జయంత్‌ సిన్హా అన్నారు. ఆటో రిక్షాలో కిలోమీటర్‌కు రూ . 5 వరకూ చార్జ్‌ చేస్తుండగా, విమానాల్లో కిలోమీటర్‌కు రూ. 4 మాత్రమే వసూలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. భారత ఎయిర్‌లైన్స్‌ భారీ నష్టాలను మూటగట్టుకుంటున్న క్రమంలో సిన్హా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఎయిర్‌లైన్స్‌ల సమిష్టి నష్టాలు రూ 12,000 కోట్ల వరకూ ఉంటాయన్న అంచనాలు వెల్లడయ్యాయి. ఎయిర్‌ ఇండియా, జెట్‌ ఎయిర్‌వేస్‌ వంటి సంస్ధలతో పాటు అన్ని ఎయిర్‌లైన్‌లు ఇంధన ధరల భారం, తక్కువ ప్రయాణ చార్జీలతో కుదేలవుతున్నాయి.

పెరుగుతున్న వ్యయాలకు అనుగుణంగా టికెట్‌ ధరలను పెంచకపోవడం ఎయిర్‌లైన్స్‌ నష్టాలకు కారణమవుతున్నాయని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇండిగో మినహా అన్ని ఎయిర్‌లైన్‌ కంపెనీలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి.

మరిన్ని వార్తలు