అల్ట్రాటెక్ చేతికి జేపీ సిమెంటు ప్లాంట్లు

1 Apr, 2016 01:48 IST|Sakshi
అల్ట్రాటెక్ చేతికి జేపీ సిమెంటు ప్లాంట్లు

ఏపీ సహా ఇతర రాష్ట్రాల యూనిట్లలో కొన్నింటి విక్రయం
డీల్ విలువ రూ. 15,900 కోట్లు

 న్యూఢిల్లీ: సిమెంటు రంగంలో కన్సాలిడేషన్‌కు తెరతీస్తూ రుణ సంక్షోభంలో ఉన్న జైప్రకాష్ అసోసియేట్స్ (జేఏఎల్) తమ సిమెంటు వ్యాపారంలో కొంత భాగాన్ని అల్ట్రాటెక్ సంస్థకు విక్రయించింది. ఈ డీల్ విలువ రూ. 15,900 కోట్లు. గత నెలలో కర్ణాటక ప్లాంటును కూడా విక్రయించాలని యోచించినప్పటికీ... తాజాగా దాన్ని పక్కన పెట్టడంతో ఒప్పందం విలువ రూ. 16,500 కోట్ల నుంచి రూ. 15,900 కోట్లకు తగ్గింది. కర్ణాటక ప్లాంటు వార్షికోత్పత్తి సామర్థ్యం 1.2 మిలియన్ టన్నులుగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని 17.2 మిలియన్ టన్నుల సామర్థ్యం గల ప్లాంట్లను, 4 మిలియన్ టన్నుల గ్రైండింగ్ యూనిట్‌ను (యూపీ) అల్ట్రాటెక్‌కు విక్రయించేందుకు బోర్డు ఆమోదించినట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు జేఏఎల్ వెల్లడించింది.

కర్ణాటకలోని షాబాద్ ప్లాంటును మినహాయించేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి. మొత్తం డీల్ విలువ రూ. 15,900 కోట్లు కాగా, గ్రైండింగ్ యూనిట్ పనుల పూర్తి కోసం గాను యూటీసీఎల్ మరో రూ.470 కోట్లు చెల్లిస్తుంది. 9-12 నెలల్లోగా విక్రయ ప్రక్రియ పూర్తి కాగలదని జేఏఎల్ తెలిపింది. ఒప్పందం అనంతరం ఆంధ్రప్రదేశ్ సహా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో జేఏఎల్ వద్ద మొత్తం 10.6 మిలియన్ టన్నుల సామర్ధ్యం గల ప్లాంట్లు మిగులుతాయి.

అటు అల్ట్రాటెక్ సామర్థ్యం 91.1 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. తమ అంచనాల ప్రకారం కొనుగోలు ప్రక్రియ పూర్తికావటానికి 12-14 నెలలు పట్టొచ్చని స్టాక్ ఎక్స్చేంజీలకు అల్ట్రాటెక్ తెలిపింది. వేల కోట్ల రుణాలతో సతమతమవుతున్న జేపీ అసోసియేట్స్‌కి తాజా డీల్‌తో కొంత ఊరట లభించనుంది.

 తాజా పరిణామంతో జేఏఎల్ షేర్లు బీఎస్‌ఈలో 3.66 శాతం పెరిగి రూ. 7.64 వద్ద, అల్ట్రాటెక్ షేర్లు 1.09 శాతం పెరిగి రూ. 3,227 వద్ద ముగిశాయి.

>
మరిన్ని వార్తలు