‘ఆ భవనం కోసం రూ.1150 కోట్లు వెచ్చించాడు’

13 Feb, 2020 10:53 IST|Sakshi

న్యూయార్క్‌ : ఈకామర్స్‌ దిగ్గజం, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు జెఫ్‌ బెజోస్‌ బెవర్లీ హిల్స్‌లో అత్యంత విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. ఈ భవనం కోసం ఏకంగా 165 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 1150 కోట్లు) చెల్లించేందుకు సిద్ధమయ్యారు. లాస్‌ఏంజెల్స్‌ ప్రాంతంలో ఓ ఇంటిపై ఇంత ధర పలకడం ఇదే రికార్డని ఈ వ్యవహారం గురించి అవగాహన ఉన్న వ్యక్తి వెల్లడించారు. 1930ల్లో హాలీవుడ్ ఫిల్మ్ టైటాన్ జాక్ వార్నర్ కోసం రూపొందించిన ఈ ప్రాపర్టీని ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ 1992 లో "ఆర్కిటిపాల్ స్టూడియో మొగల్ ఎస్టేట్"గా అభివర్ణించింది. ఈ భవనంలో జార్జియన్ శైలిలో విస్తారమైన టెర్రేస్‌లతో పాటు భారీ గోల్ప్‌ కోర్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

వాల్‌స్ర్టీట్‌ జర్నల్‌లో ప్రచురితమైన కథనం ప్రకారం జెఫ్‌ బెజోస్‌ ఎంచుకున్న వార్నర్‌ ఎస్టేట్‌ 1990 నుంచి డేవిడ్‌ జెఫెన్‌ ఆధీనంలో ఉందని, దీన్ని ఆయన రూ. 280 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. బెజోస్‌ ఇటీవల అమెజాన్‌లో 400 కోట్ల డాలర్ల విలువైన షేర్లను నగదుగా మార్చుకున్న క్రమంలో ఆయన విపరీతంగా షాపింగ్‌పై వెచ్చిస్తున్న వార్తలు వెలువడటం గమనార్హం. 2019లో భార్య మెకంజీ బెజోస్‌తో విడాకులు పొందిన అనంతరం గర్ల్‌ఫ్రెండ్‌ లౌరెన్‌ సాంచెజ్‌తో విలాసవంతంగా గడుపుతున్న ఫోటోలు సోషల్‌ మీడియాలోనూ హల్‌చల్‌ చేస్తున్నాయి.

గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి కొత్త జీవితాన్ని ఆస్వాదించేందుకే ఆయన భారీ కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఆర్ట్‌ మార్కెట్‌లోకూ ఎంటరైన జెఫ్‌ బెజోస్‌ ఆర్టిస్ట్‌ ఎడ్‌ రుసా వర్క్‌ను క్రిస్టీ ఆక్షన్‌లో హర్టింగ్‌ ది వర్డ్‌ రేడియో కోసం 52.5 మిలియన్‌ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశారు. కెర్రీ జేమ్స్‌ మార్షల్‌ విగ్నెట్‌ 19ను ఏకంగా 18.5 మిలియన్‌ డాలర్లతో సొంతం చేసుకున్నారు. ఇక బెజోస్‌కు ఇప్పటికే వాష్టింగ్టన్‌ డీసీ వంటి అమెరికన్‌ తీర ప్రాంతాల్లో విలాసవంతమైన భవనాలున్నాయి. ఇవాంక ట్రంప్‌, జేర్డ్‌ కుష్నర్‌ వంటి సెలబ్రిటీలకు ఆయన ఇటీవల వాషింగ్టన్‌ డీసీ మాన్షన్‌లో భారీ విందు ఇచ్చారు.

చదవండి : నగ్న ఫోటోల లీకేజీ వివాదంలో ప్రపంచ కుబేరుడు

>
మరిన్ని వార్తలు