జెట్‌ ఎయిర్‌వేస్‌ చైర్మన్‌గా వైదొలగిన నరేష్‌ గోయల్‌

25 Mar, 2019 16:47 IST|Sakshi

ముంబై : సంక్షోభంలో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ బోర్డు నుంచి చైర్మన్‌ నరేష్‌ గోయల్‌, ఆయన భార్య తప్పుకున్నారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ బోర్డు నుంచి నరేష్‌ గోయల్‌, ఆయన భార్య అనిత్‌ గోయల్‌, పూర్తికాల డైరెక్టర్‌ గౌరంగ్‌ షెట్టి, నసీం జైదీ తప్పుకోవాలని బోర్డు సూచించింది. ఇందుకు ప్రతిగా అత్యవసర నిధి కింద రూ 1500 కోట్లు సమీకరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం ఈ నిధులను జెట్‌ ఎయిర్‌వేస్‌కు అందచేస్తుంది. గోయల్‌ బృందం బోర్డు నుంచి వైదొలగడంతో వారంలోగా జెట్‌ ఎయిర్‌వేస్‌కు అత్యవసర సాయం అందించేందుకు బ్యాంకుల కన్సార్షియం ముందుకొచ్చిందని ఎయిర్‌లైన్‌ వర్గాలు తెలిపాయి. కాగా దివాలా చట్టానికి అనుగుణంగా ప్రక్రియను చేపట్టడం కంటే రుణదాతలకు, కంపెనీకి మధ్య సంప్రదింపులు జరగడమే మేలని సీనియర్‌ అధికారి వ్యాఖ్యానించారు.

తాజా పరిణామాల నేపథ్యంలో జెట్‌ ఎయిర్‌వేస్‌లో గోయల్‌ వాటా 51 శాతం నుంచి 25.5 శాతానికి, ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ వాటా 12 శాతానికి తగ్గుతుందని, బ్యాంకులకు 50.5 శాతం వాటాతో కంపెనీపై నియంత్రణ లభించేందుకు మార్గం సుగమమైందని భావిస్తున్నారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ దివాళా తీయకుండా కాపాడేందుకు ఎయిర్‌లైన్‌ను కాపాడాలని ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియంకు ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే.

కాగా మూడు నెలల నుంచి తమకు జీతాలు చెల్లించడం లేదని జెట్‌ ఎయిర్‌వేస్‌ ఇంజనీర్లు, ఇతర సిబ్బంది, పైలట్లు ఆందోళన చేపడుతున్నారు. ఏప్రిల్‌ 1లోపు పెండింగ్‌ వేతన బకాయిలను పరిష్కరించకపోతే అదే రోజు నుంచి సేవలు నిలిపివేస్తామని పైలట్లు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు