నేటి నుంచి జెట్‌ పైలట్ల సమ్మె

15 Apr, 2019 05:31 IST|Sakshi

ముంబై: జీతాల బకాయిలు చెల్లించాలన్న డిమాండ్‌తో ప్రైవేట్‌ రంగ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ పైలట్లు సోమవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. ఉదయం 10 నుంచి విమానాలను నడపరాదని నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సుమారు 1,100 పైలట్లు ఇందులో పాల్గొనున్నట్లు పేర్కొన్నాయి. ‘మూడున్నర నెలలుగా మాకు జీతాలు అందడం లేదు. అందుకే ఏప్రిల్‌ 15 నుంచి విమానాలు నడపరాదని నిర్ణయం తీసుకున్నాం. నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌ (ఎన్‌ఏజీ)లోని మొత్తం 1,100 పైలట్లు సోమవారం ఉదయం 10.గంటల నుంచి విమానాలు నడపబోరు‘ అని ఎన్‌ఏజీ వర్గాలు తెలిపాయి.

వాస్తవానికి ఏప్రిల్‌ 1 నుంచే నిలిపివేయాలని ముందుగా భావించినప్పటికీ .. కొత్త యాజమాన్యానికి కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ తర్వాత ఏప్రిల్‌ 15 దాకా వాయిదా వేసుకున్నట్లు పేర్కొన్నాయి. రూ. 8,000 కోట్ల పైగా రుణభారంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ మేనేజ్‌మెంట్‌ బాధ్యతలను ఇటీవలే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సారథ్యంలోని కన్సార్షియం తన చేతుల్లోకి తీసుకున్న సంగతి తెలిసిందే.  

విదేశీ విమానాల రద్దు...: ఆగ్నేయాసియా ప్రాంతాలు, సార్క్‌ దేశాలకు నడిపే విమానాలను నిరవధికంగా రద్దు చేసినట్లు జెట్‌ ఎయిర్‌వేస్‌ తెలిపింది. అటు టొరంటో, ప్యారిస్, ఆమ్‌స్టర్‌డామ్, లండన్‌ హీత్రో వంటి ఇతర విదేశీ రూట్లలో సర్వీసుల నిలిపివేతను ఏప్రిల్‌ 16 దాకా (మంగళవారం) పొడిగించినట్లు జెట్‌ ఎయిర్‌వేస్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు