జెట్‌ఎయిర్‌వేస్‌ ఎకానమీ తరగతుల్లో ఉచిత భోజనం కట్‌ 

4 Dec, 2018 01:30 IST|Sakshi

ముంబై: వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా జెట్‌ఎయిర్‌వేస్‌ దేశీయ మార్గాల్లో మరో రెండు ఎకానమీ తరగతి ప్రయాణికులకు ఉచిత భోజన సదుపాయాన్ని ఉపసంహరించుకుంది. వచ్చే జనవరి 7 నుంచి మొదలయ్యే ప్రయాణాల కోసం డిసెంబర్‌ 21 నుంచి బుక్‌ చేసుకునే టికెట్లపై ఇది అమలవుతుందని జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రకటించింది. ఎకానమీ విభాగంలో దేశీయ మార్గాల్లో ప్రయాణించే వారికి లైట్, డీల్, సేవర్, క్లాసిక్, ఫ్లెక్స్‌ పేరుతో ఐదు రకాల ధరల ఆప్షన్లను జెట్‌ఎయిర్‌వేస్‌ ప్రస్తుతం ఆఫర్‌ చేస్తోంది.

ఇందులో లైట్, డీల్‌ విభాగాల్లో ఇంతకుముందే ఉచిత భోజనం తొలగించగా, తాజాగా ట్రావెల్‌ సేవర్, క్లాసిక్‌ నుంచి కూడా వీటిని తీసివేయనుంది. దీంతో ఇకపై ఫ్లెక్స్‌ ఆప్షన్‌లో మాత్రమే ప్రయాణికులకు ఉచిత భోజన సదుపాయం లభించనుంది. ఇక ఈ నెల 21కి ముందు బుక్‌ చేసుకునే వారికి ప్రస్తుతమున్నట్టుగానే ఉచిత భోజనం అందిస్తామని జెట్‌ఎయిర్‌వేస్‌ తెలిపింది. ప్లాటినం, గోల్డ్‌ కార్డు కలిగిన సభ్యులకు ఇక ముందూ కాంప్లిమెంటరీ ఉచిత భోజనం పొందొచ్చని స్పష్టం చేసింది. ఇంధన ధరల పెరుగుదలతో జెట్‌ఎయిర్‌వేస్‌ ఇటీవలి కాలంలో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.    

మరిన్ని వార్తలు