ఎన్‌సీఎల్‌టీ ముంగిట జెట్‌

19 Jun, 2019 11:13 IST|Sakshi

పిటిషన్‌ దాఖలు చేసిన బ్యాంకులు

విచారణ బుధవారానికి వాయిదా  

ముంబై: దాదాపు రూ.8,500 కోట్ల రుణ బకాయిలను రాబట్టుకునే దిశగా ప్రైవేట్‌ రంగ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌పై బ్యాంకులు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్‌సీఎల్‌టీ) ఆశ్రయించాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సారథ్యంలోని 26 బ్యాంకులు మంగళవారం పిటిషన్‌ దాఖలు చేశాయి. దీనిపై విచారణను ట్రిబ్యునల్‌ బుధవారానికి వాయిదా వేసింది. రుణాలు, నష్టాల భారం పేరుకుపోవడంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ ఏప్రిల్‌ 17న కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా కంపెనీని విక్రయించడానికి బ్యాంకులు ప్రయత్నిస్తున్నప్పటికీ... వివిధ కారణాల వల్ల సాధ్యపడటం లేదు.

బ్యాంకులకు రూ. 8,500 కోట్లతో పాటు, వందల కొద్దీ వెండార్లకు (విమానాలు లీజుకిచ్చిన సంస్థలు మొదలైనవి) రూ.10,000 కోట్లను జెట్‌ చెల్లించాల్సి ఉంది. ఇక మార్చి నుంచి ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించడం లేదు. దీంతో 23,000 మంది పైచిలుకు ఉద్యోగులకు రూ.3,000 కోట్ల మేర జీతాల బకాయిలు చెల్లించాల్సి ఉంది. మంగళవారం జెట్‌ షేరు 41 శాతం క్షీణించి రూ. 40.45 వద్ద క్లోజయ్యింది. ఒక దశలో 53 శాతం క్షీణించి రూ.32.25 ఆల్‌టైం కనిష్ట స్థాయిని కూడా తాకింది. గడిచిన అయిదు ట్రేడింగ్‌ సెషన్లలో షేర్ల విలువ 73 శాతం పైగా హరించుకుపోయింది. 

>
మరిన్ని వార్తలు