జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగులకు అందనున్న వేతనం

21 Oct, 2018 11:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సమస్యలతో సతమతమవుతున్న ప్రైవేట్‌ ఎయిర్‌లైనర్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌ సెప్టెంబర్‌ వేతనంలో 25 శాతాన్ని ఈనెల 25న అందచేయనుంది. పైలట్లు, ఇంజనీర్లు, సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ సిబ్బందికి వేతనాలు జమ చేస్తామని సంస్థ పేర్కొంది. గత నెలలో మిగిలిన 75 శాతం వేతన చెల్లింపును ఎప్పుడు చేపడతారనేది వెల్లడించకపోవడం గమనార్హం. 

16,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్న జెట్‌ ఎయిర్‌వేస్ ఆగస్ట్‌ నుంచి పైలట్లు, ఇంజనీర్లు, సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ ఉద్యోగులకు వేతనాల చెల్లింపులో జాప్యం చేస్తోంది. వేతన బకాయిని వీలైనంత త్వరలో చెల్లిస్తామని జెట్‌ ఎయిర్‌వేస్‌ సీపీఓ రాహుల్‌ తనేజా పేర్కొన్నారు.

ఇక ఆగస్ట్‌ వేతనాన్ని సెప్టెంబర్‌ 11, 26 తేదీల్లో చెల్లించనున్నట్టు గతంలో కంపెనీ వెల్లడించింది. ఆయా తేదీల్లో పూర్తి వేతనం చెల్లించలేకపోయిన సంస్థ సెప్టెంబర్‌ వేతనాన్ని అక్టోబర్‌ 9కి క్లియర్‌ చేసింది. వేతన సమస్యను పరిష్కరించేందుకు జెట్‌ ఎయిర్‌వేస్‌ ఛైర్మన్‌ నరేష్‌ గోయల్‌ నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌తో సంప్రదింపులు జరిపారని కంపెనీ పేర్కొంది.

మరిన్ని వార్తలు