భారీగా పడిపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్‌

10 Aug, 2018 11:44 IST|Sakshi
జెట్‌ ఎయిర్‌వేస్‌ (ఫైల్‌ ఫోటో)

ముంబై : దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు భారీగా పడిపోయింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు 14.5 శాతం మేర కిందకి దిగ జారింది. ఇది మూడేళ్ల కనిష్ట స్థాయి. తొలి క్వార్టర్‌ ఫలితాలను కంపెనీ వాయిదా వేయడంతో, షేర్‌ ధర తీవ్ర ఒడిదుడుకులు పాలవుతోంది. 2018-19 ఆర్థిక సంవత్సరపు జూన్‌తో ముగిసిన తొలి క్వార్టర్‌ ఫలితాలను ప్రకటించడానికి ఆ కంపెనీ ఆడిటర్లు ఆమోదం తెలుపలేదు. కొన్ని విషయాల మూసివేత కారణంతో ఆడిట్‌ కమిటీ, కంపెనీ బోర్డుకు ఫలితాల ప్రకటన గురించి ఎలాంటి ఆమోదం పంపించలేదు. దీంతో కంపెనీ ఫలితాల ప్రకటన వాయిదా వేస్తున్నట్టు జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రకటించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే గత ముగింపుకు 6.53 శాతం నష్టంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు ఎంట్రీ ఇచ్చింది. ఆ అనంతరం మరింత కిందకి పడిపోతూ వస్తోంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు ఇంతలా పడిపోతూ ఉంటే.. దీని ప్రత్యర్థి కంపెనీలు ఇంటర్‌గ్లోబల్‌ ఏవియేషన్‌ లిమిటెడ్‌, స్పైస్‌జెట్‌లు 1.7 శాతం, 2.2 శాతం పైకి ఎగుస్తున్నాయి. 

జెట్‌ ఎయిర్‌వేస్‌ ఫలితాలపై ఇప్పటికే విశ్లేషకులు ప్రతికూలంగా స్పందిస్తున్నారు. బ్రోకరేజ్‌ సంస్థ ఎలరా క్యాపిటల్‌ అంచనాల ప్రకారం జెట్‌ ఎయిర్‌వేస్‌ రూ.490 కోట్ల నికర నష్టాలను నమోదు చేస్తుందని తెలుస్తోంది. ఇంధన ఖర్చులు పెరిగిపోవడం, రూపాయి విలువ క్షీణించడం వంటి కారణాలతో ఈ సారి ఏవియేషన్‌ సెక్టార్‌ అవుట్‌లుక్‌ పరిస్థితి కాస్త గందరగోళంగానే ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల ఇండిగో తాను ప్రకటించిన ఫలితాల్లో నికర లాభాల్లో 97 శాతాన్ని కోల్పోయింది. ఇదే అత్యంత చెత్త ప్రదర్శన అని కంపెనీ పేర్కొంది. స్పైస్‌జెట్‌ తన ఫలితాలను వచ్చే వారంలో ప్రకటించబోతుంది. మరోవైపు ఇంధన ధరలు పెరిగిపోవడం, రూపాయి విలువ క్షీణించడం వంటి కారణాలతో జెట్‌ ఎయిర్‌వేస్‌ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి మరలింది. తొలుత ఉద్యోగుల వేతనాల్లో 25 శాతం కోత పెట్టాలని చూసింది. ఆ ప్రతిపాదనకు పైలెట్లు ఒప్పుకోకపోవడంతో, 500 మంది ఉద్యోగులను తీసివేయాలని ప్లాన్‌ చేస్తున్నట్టు రిపోర్టులు వస్తున్నాయి.  అంతేకాక తన క్యారియర్‌ వాటాను కొంతమేర విక్రయించేందుకు సాయపడాలని ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లను సైతం జెట్‌ ఎయిర్‌వేస్‌ కోరింది.

మరిన్ని వార్తలు