జెట్‌లో వాటాలపై టాటాల ఆసక్తి..

14 Nov, 2018 02:13 IST|Sakshi

చురుగ్గా చర్చలు

లాభనష్టాల బేరీజులో టాటా సన్స్‌ నిపుణులు

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విమానయాన దిగ్గజం జెట్‌ ఎయిర్‌వేస్‌లో మెజారిటీ వాటాలను కొనుగోలు చేయడంపై టాటా సన్స్‌ మరింతగా దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి ఇరు వర్గాల మధ్య చురుగ్గా చర్చలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఇంకా ఖాతాల మదింపు, ఇతరత్రా కీలక గణాంకాల పరిశీలన స్థాయి దాకా రాలేదని వివరించాయి. వ్యయాలు, వ్యూహాలపరంగా జెట్‌ కొనుగోలు లాభసాటిగానే ఉంటుందా, తమ ఏవియేషన్‌ వ్యాపారానికి అనుగుణంగా దీన్ని మల్చుకోవడానికి వీలుంటుందా అన్న కోణంలో టాటా సన్స్‌ ప్రధానంగా దృష్టి పెడుతోందని వివరించాయి.

ఈ నేపథ్యంలో కంపెనీని పూర్తిగా కొనడం కాకుండా.. జెట్‌కి చెందిన విమానాలు, పైలట్లు, స్లాట్లు మొదలైనవి మాత్రమే తీసుకునే విధంగా టాటా సన్స్‌ ఒక ప్రతిపాదన చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. దీంతో పాటు పలు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని వివరించాయి. ఏదేమైనా జెట్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ తప్పుకునేట్లు ఉంటేనే ఏదైనా డీల్‌ కుదిరే అవకాశం ఉండొచ్చని పేర్కొన్నాయి.

కంపెనీని మళ్లీ గాడిన పెట్టేందుకు నిర్ణయాలు తీసుకోవడానికి పూర్తి అధికారాలు తనకు లభించేట్లు ఉంటేనే టాటా సన్స్‌ ముందుకెళ్లొచ్చని వివరించాయి. టాటా గ్రూప్‌ ప్రస్తుతం సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో కలిసి విస్తార పేరుతో పూర్తి స్థాయి విమానయాన సంస్థను, మలేíసియాకి చెందిన ఎయిర్‌ఏషియా గ్రూప్‌తో కలిసి చౌకచార్జీల సంస్థ ఎయిర్‌ఏషియా ఇండియాను నిర్వహిస్తోంది. జెట్‌లో నరేష్‌ గోయల్‌కు 51 శాతం, ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌కు 24 శాతం వాటాలు ఉన్నాయి.  

నష్టాల జెట్‌..
ముడిచమురు ధరల పెరుగుదల, బలహీన రూపాయి, చౌక చార్జీలు, తీవ్రమైన పోటీ తదితర అంశాలతో నరేష్‌ గోయల్‌ సారథ్యంలోని జెట్‌ ఎయిర్‌వేస్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. ఎయిర్‌క్రాఫ్ట్‌లను లీజుకిచ్చిన సంస్థలకు, ఉద్యోగులకు చెల్లింపులు జరపడంలోనూ విఫలమవుతోంది.

ఇటీవల రెండో త్రైమాసిక ఫలితాల్లో ఏకంగా రూ. 1,261 కోట్ల నష్టాలు ప్రకటించింది. దీంతో కార్యకలాపాలను పునర్‌వ్యవస్థీకరించుకోవడంపై కసరత్తు చేస్తున్నట్లు.. లాభసాటిగా లేని రూట్లలో ఫ్లయిట్స్‌ను, వ్యయాలను తగ్గించుకోవడం, ఆదాయాలను పెంచుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు జెట్‌ వెల్లడించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర ఈ ఏడాది ఇప్పటిదాకా 70 శాతం పడిపోయింది.

మరిన్ని వార్తలు