అలా చేయకపోతే, జెట్‌ ఎయిర్‌వేస్‌ ఎగరదు

3 Aug, 2018 14:01 IST|Sakshi
జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగుల వేతనాలు కోత (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ లిమిటెడ్‌, ఉద్యోగులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. వేతన తగ్గింపు లాంటి వ్యయ నిర్మూలన చర్యలు తీసుకోకపోతే, 60 రోజుల అనంతరం జెట్ ఎయిర్‌వేస్‌ ఇక ఎగరకుండా.. గ్రౌండ్‌కే పరిమితం కావాల్సి వస్తుందని తెలిపింది. ఈ విషయాన్ని కంపెనీ ఓ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ తెలిపారు. రెండేళ్ల వరకు 15 శాతం వేతనం తగ్గించుకోవాలని జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రతిపాదించింది. ఈ  ప్రతిపాదనను పైలెట్లు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవడం లేదు. ఖర్చులను తగ్గించుకుని, రెవెన్యూలను పెంచుకుందామని జెట్‌ ఎయిర్‌వేస్‌ వేతన కోత విషయాన్ని పైలెట్లకు తెలిపిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కానీ వేతన కోతను జెట్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించేటట్టు కనిపించడం లేదు. దీంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ ఈ హెచ్చరికలు జారీచేసింది.

సేల్స్‌, డిస్ట్రిబ్యూషన్‌, పేరోల్‌, మెయింటనెన్స్‌ వంటి ఏరియాల్లో పొదుపు చేపట్టాలని కంపెనీ చూస్తోందని, దీంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ను ఆరోగ్యకరమైన, మరింత స్థితిస్థాపక వ్యాపారంగా మార్చుకోవాలనుకుంటున్నట్టు కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. ఈ విషయంపై జెట్‌ ఎయిర్‌వేస్‌ వాటాదారులందరితో సంప్రదింపులు కూడా జరిపింది. ఈ వ్యయాలు తగ్గించుకునే క్రమంలో, జెట్‌ ఎయిర్‌వేస్‌ కొందరు స్టాఫ్‌ను కూడా తీసేయాలని చూస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.  అయితే పైలెట్లపై లేఆఫ్స్‌ ప్రభావం ఉండదని పేర్కొన్నాయి. 

కాగ, ఉద్యోగుల వేతనాల్లో జెట్‌ ఎయిర్‌వేస్‌ కోత పెడుతున్నట్టు నిన్ననే(గురువారం) రిపోర్టులు వచ్చాయి. ఆగస్టు నుంచి ఈ తగ్గింపు వేతనాలను జెట్‌ ఎయిర్‌వేస్‌ అమలు చేయనుందని ఎకానమిక్‌ టైమ్స్‌ రిపోర్టు చేసింది. ఈ వేతన కోతను ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా పైలెట్లు అసలు ఈ ప్రతిపాదనకు ఒప్పుకోవడం లేదని తెలిసింది. ఒకవేళ వేతన కోతను చేపట్టకపోతే, 60 రోజులకు మించి జెట్‌ ఎయిర్‌వేస్‌ను ఆపరేట్‌ చేయడం కుదరదని ఈ విమానయాన సంస్థ మేనేజ్‌మెంట్‌ హెచ్చరించింది. ఆర్థికంగా జెట్‌ ఎయిర్‌వేస్‌ చితికి పోయిందని వార్తలు వెలువడిన క్రమంలో స్టాక్‌ మార్కెట్‌లో ఈ విమానయాన సంస్థ షేర్లు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 6 శాతం వరకు క్షీణించాయి. రూ.323.90 వద్ద ప్రారంభమైన దీని షేరు రూ.312.15 వద్ద కనిష్ట స్థాయిలను తాకింది. 

జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రస్తుతం ఒత్తిడిలో కొనసాగుతోంది. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరుగడం, రూపాయి విలువ క్షీణించడం వంటి కారణాలతో జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఖర్చులు పెరిగిపోయాయి. వీటిని రికవరీ చేసుకునేందుకు జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగుల వేతనాల్లో కోత పెడుతోంది. 2017 జూలైలో 12 మంది జూనియర్‌ పైలెట్లను 30-50 శాతం వేతనాన్ని మాత్రమే తీసుకోవాలని ఆదేశించింది. లేదంటే ఉద్యోగం మానేసి ఇంటికి వెళ్లిపోవచ్చని కూడా పేర్కొంది. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి జెట్‌ ఎయిర్‌వేస్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లను కూడా ఆశ్రయిస్తోంది. క్యారియర్‌లోని వాటాను అమ్మిపెట్టాలని కోరుతోందని తెలుస్తోంది.
 

>
మరిన్ని వార్తలు