ఐడియాకు జియో దెబ్బ

28 Jul, 2017 00:04 IST|Sakshi
ఐడియాకు జియో దెబ్బ

► వరుసగా మూడో క్వార్టర్‌లోనూ నష్టాలే
► క్యూ1లో రూ. 816 కోట్ల నష్టం  


న్యూఢిల్లీ:  రిలయన్స్‌ జియో చౌక ఆఫర్ల దెబ్బ నుంచి ఐడియా సెల్యులార్‌ కోలుకోలేకపోతోంది. వరుసగా మూడో త్రైమాసికంలోనూ నష్టాలే చవిచూసింది. మార్చి త్రైమాసికంలో రూ.326 కోట్లు నష్టపోయిన ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏకంగా రూ.816 కోట్ల మేర నష్టాలు ప్రకటించింది. గతేడాది క్యూ1లో కంపెనీ నికర లాభం రూ. 217 కోట్లు. ఇక తాజాగా ఐడియా ఆదాయం సైతం 14% క్షీణించి రూ. 9,552 కోట్ల నుంచి రూ. 8,182 కోట్లకు పడిపోయింది.

రిలయన్స్‌ జియో తమ ఉచిత 4జీ సర్వీసులను మార్చిలోనే నిలిపివేసినప్పటికీ.. ఐడియా ఆర్థిక పనితీరుపై ప్రతికూల ప్రభావం కొనసాగింది.‘కొత్త సంస్థ ఉచిత సేవల నుంచి పెయిడ్‌ సర్వీసులకు మళ్లినా.. అన్‌లిమిటెడ్‌ వాయిస్‌కాల్స్, డేటా ప్లాన్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తుండటంతో దేశీ వైర్‌లెస్‌ పరిశ్రమపై ఆ ప్రతికూల ప్రభావాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనూ కొనసాగాయి’ అని ఐడియా పేర్కొంది.

డేటా వినియోగం పెరిగింది ..
దీటుగా పోటీనిచ్చే క్రమంలో తామూ అన్‌లిమిటెడ్‌ ప్లాన్లను ప్రవేశపెట్టడంతో పరిశ్రమ ఆదాయాలు మరింత తగ్గే అవకాశం ఉందని ఐడియా తెలిపింది. అయితే, రేట్లు తగ్గించినప్పటికీ.. వినియోగ పరిమాణం పెరగడం వల్ల మొబైల్‌ వాయిస్, డేటా సెగ్మెంట్లలో నష్టం కొంత భర్తీ అయినట్లు ఐడియా తెలిపింది. సీక్వెన్షియల్‌ ప్రాతిపదికన మొబైల్‌ డేటా పరిమాణం ఏకంగా 99.1% ఎగిసిందని, 252.8 బిలియన్‌ మెగా బైట్స్‌ మేర డేటా వినియోగం అయ్యిందని వివరించింది. ఇక, జూన్‌ చివిరికి కంపెనీ రుణభారం రూ. 53,920 కోట్లు. ఇందులో సింహభాగం స్పెక్ట్రం చెల్లింపుల కోసం తీసుకున్న రుణాలే ఉన్నాయి. గురువారం బీఎస్‌ఈలో ఐడియా షేరు 2 శాతం క్షీణించి రూ. 92.65 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు