జియో ఎఫెక్ట్‌ : మళ్లీ పడిన వొడాఫోన్‌

25 Jul, 2018 20:17 IST|Sakshi
వొడాఫోన్‌ ఫైల్‌ ఫోటో

టెలికాం మార్కెట్‌లో రిలయన్స్‌ జియో సంచలనంతో దిగ్గజాలు ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు.  దేశీయ రెండో అతిపెద్ద టెలికాం వొడాఫోన్‌ మరోసారి తన క్వార్టర్‌ ఫలితాల్లో కిందకి పడిపోయింది. నేడు ప్రకటించిన జూన్‌ క్వార్టర్‌ ఫలితాల్లో వొడాఫోన్‌ రెవెన్యూలు 22.3 శాతం క్షీణించి 959 మిలియన్‌ యూరోలుగా(రూ.7706 కోట్లగా) రికార్డైనట్టు తెలిసింది. టర్మినేషన్‌ రేట్ల కోత, తీవ్రతరమవుతున్న పోటీ నేపథ్యంలో తన రెవెన్యూలను కోల్పోయినట్టు వొడాఫోన్‌ ప్రకటించింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో 1.387 బిలియన్‌ యూరోల రెవెన్యూలను ఈ కంపెనీ పోస్టు చేసింది. కాగ, రిలయన్స్‌ జియో నుంచి వస్తున్న పోటీని ధీటుగా ఎదుర్కొనేందుకు వొడాఫోన్‌, ఐడియా సెల్యులార్‌లు ఒకటిగా అతిపెద్ద దేశీయ టెలికాం సంస్థగా అవతరించబోతున్నాయి. ఈ విలీనానికి టెలికాం డిపార్ట్‌మెంట్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆగస్టు వరకు తమ విలీనాన్ని పూర్తి చేస్తామని ఈ కంపెనీలు ప్రకటించాయి. 

అయితే గత మార్చి క్వార్టర్‌తో పోలిస్తే, సర్వీసు రెవెన్యూలు కేవలం 0.2 శాతం మాత్రమే తగ్గాయని కంపెనీ చెప్పింది. ఈ మూడు నెలల కాలంలో ప్రీపెయిడ్‌ ధరలు స్థిరంగా కొనసాగించడంతో, కాస్త సర్వీసు రెవెన్యూల నష్టాలను తగ్గించుకోగలిగామని పేర్కొంది. పోస్టు పెయిడ్‌ కనెక్షన్లకు ఒక్కో యూజర్‌ సగటు రెవెన్యూ 20 శాతం పడిపోయిందని, ప్రీపెయిడ్‌ కనెక్షన్లకు 28 శాతం తగ్గిందని ఫైల్‌ చేసింది. 29 శాతానికి పైగా తమ ప్రీపెయిడ్‌ యూజర్లు అపరిమిత ఆఫర్లను పొందుతున్నారని, 77 మిలియన్‌ మంది డేటాను వాడుతుండగా.. వారిలో 20.9 మిలియన్ల మంది 4జీ ని కలిగి ఉన్నారని పేర్కొంది. భారత్‌లో డేటా ధరలు భారీగా తగ్గిపోవడంతో, కస్టమర్లు నెలకు సగటున  4.6జీబీ డేటా వాడుతున్నట్టు వొడాఫోన్‌ చెప్పింది. ఇదే యూరప్‌లో అయితే కేవలం 2.8 జీబీ మాత్రమేనని వెల్లడించింది. అయితే తక్కువ ధరల వద్ద హై-వాల్యు కస్టమర్లను కాపాడుకునే సత్తా తమకు ఉందని కంపెనీ చెప్పింది. 

మరిన్ని వార్తలు