సెక్యూరిటీ సేవల్లోకి జియో

5 Sep, 2019 12:54 IST|Sakshi

అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌

కమ్యూనిటీలకు సర్వీసులు

జియోగేట్‌ పేరుతో యాప్‌...

న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీకి చెందిన టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో మరిన్ని కొత్త రంగాల్లోకి కార్యకలాపాలు విస్తరిస్తోంది. తాజాగా అపార్ట్‌మెంట్ల భద్రత నిర్వహణ సేవల విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకు సంబంధించి యాపిల్‌ యాప్‌ స్టోర్, గూగుల్‌ ప్లే స్టోర్‌లో జియో గేట్‌ పేరిట కొత్త యాప్‌ ప్రత్యక్షమవడం ఈ వార్తలకు ఊతమిస్తోంది. గేటెడ్‌ కమ్యూనిటీల్లో విజిటర్లు మొదలుకుని రోజువారీ సిబ్బంది, డెలివరీ బాయ్స్, క్యాబ్స్‌ దాకా అన్నింటి రాకపోకల వివరాల నిర్వహణ అంతా జియోగేట్‌ క్రమబద్ధీకరిస్తుందని యాప్‌ గురించిన వివరణలో ఉంది. ‘దొంగతనాలు, నేరాలపై ఆందోళన  లేకుండా కమ్యూనిటీ పరిసర ప్రాంతాలను సురక్షితంగా తీర్చిదిద్దేలా సెక్యూరిటీ నిర్వహణ ప్రక్రియను సమూలంగా మారుస్తున్నాం‘ అని యాప్‌ గురించి జియో పేర్కొంది. 

ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీ..: ప్రస్తుతం మైగేట్, అపార్ట్‌మెంట్‌ అడ్డా, స్మార్ట్‌గార్డ్‌ వంటి సంస్థలు యాప్‌ ఆధారిత అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌ మేనేజ్‌మెంట్‌ సేవలు అందిస్తున్నాయి. జియో గానీ భారీ యెత్తున వస్తే వీటికి గట్టి పోటీనివ్వొచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. జియోగేట్‌ ఫీచర్స్‌ను బట్టి చూస్తే యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌నే ఇంటర్‌కామ్‌ డివైజ్‌గా కూడా వాడుకోవచ్చన్నట్లు తెలుస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో తామెక్కడ ఉన్నామో కుటుంబ సభ్యులు, సెక్యూరిటీ గార్డుకు తెలియజేసేందుకు వీలుగా పానిక్‌ అలర్ట్‌ ఫీచర్‌ కూడా ఇందులో ఉంది. అయితే, సెక్యూరిటీ సేవల విభాగంలోకి ఎంట్రీపై జియో ఇంకా స్పందించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు