అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌‌కు షాకివ్వనున్న జియో మార్ట్

22 Apr, 2020 13:20 IST|Sakshi
ఫైల్ ఫోటో

రిలయన్స్ రిటైల్  ఇ-కామర్స్ వెంచర్ జియోమార్ట్ 

వాట్సాప్ ద్వారా  జియోమార్ట్‌ లావాదేవీలు

జియోఫోన్లలో ఇప్పటికే వాట్సాప్  ఇన్ స్టెంట్ మెసేజ్  ఫీచర్

సాక్షి, న్యూఢిల్లీ:  రిలయన్స్ జియోతో టెలికాం మార్కెట్లో సంచలనం రేపిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) ఇక  రిటైల్ ఇ-కామర్స్ సంస్థలకు షాక్ ఇవ్వనుంది. ముఖ్యంగా దేశంలో  రీటైల్  వ్యాపార దిగ్గజాలు అమెజాన్ , వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ లాంటి  సంస్థల వ్యాపారాన్ని దెబ్బకొట్టనుంది.   ఈ ఏడాది జనవరిలో పైలట్ ప్రాజెక్టుగా మహారాష్ట్రలోని నవీ ముంబై, థానే  కళ్యాణ్ ప్రాంతాల్లో ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ గ్రాసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్  జియోమార్ట్‌  (దేశ్ కీ నయీ దుకాన్)  ఇక దేశవ్యాప్తంగా తన సేవలను ప్రారంభించనుంది. జియో ప్లాట్‌ఫాం, రిలయన్స్ రిటైల్,  వాట్సాప్ మధ్య కొత్త భాగస్వామ్యం ఫలితంగా, వినియోగదారులు తమ వాట్సాప్ ఉపయోగించి జియోమార్ట్‌తో సమీప కిరాణా దుకాణాల ద్వారా ఆన్ లైన్ చెల్లింపులతో ఇళ్లకు ఉత్పత్తులు, సేవలను  పొందవచ్చని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ  ప్రకటించారు. ఆఐఎల్ ఫేస్‌బుక్ మధ్య తాజాగా కుదిరిన రూ.43,574 కోట్ల అతి పెద్ద ఎఫ్‌డీఐ ఒప్పందంతో  2021 నాటికి  రిలయన్స్ ను రుణ రహిత సంస్థగా  రూపొందించాలన్న లక్ష్యంలో కీలక  అడుగు పడిందని మార్కెట్  వర్గాలు భావిస్తున్నాయి. (కొత్త ఉపాధి అవకాశాలు, కొత్త వ్యాపారాలు: అంబానీ)

ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ రిలయన్స్‌‌కు చెందిన జియోమార్ట్‌ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోనుంది. స్థానిక,చిన్నకిరాణా దుకాణాలు ఆన్‌లైన్‌లోకి రానున్నాయి. వాట్సాప్ సేవలకు ప్రభుత్వ అనుమతి అనంతరం వాట్సాప్‌లో జియోమార్ట్ ద్వారా స‌రుకుల‌ను ఆర్డ‌ర్ చేసిన వినియోగ‌దారుల‌కు స‌మీపంలో ఉన్న వ‌ర్త‌కులే ఇళ్ల వ‌ద్ద‌కు డెలివ‌రీ చేస్తారు. చెల్లింపులు ఆన్‌లైన్‌లో పూర్తి చేయడంతో పాటు, పంపిణీ కూడా వేగవంతమవుంది. ఇందుకు గాను వాట్సాప్ ఇప్ప‌టికే బీటా ద‌శ‌లో ఉన్న వాట్సాప్ పేమెంట్స్ సేవ‌ల‌ను త్వ‌ర‌లో భార‌త్‌లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనుంది.(వాట్సాప్ యూజర్లకు శుభవార్త)

దేశంలో ఇంకా విస్తృతంగా కార్యకలాపాలు ప్రారంభించకపోయినప్పటికీ ఇప్పటికే అనేక చిన్న వ్యాపారులు,  కిరాణా షాపులను జియోమార్ట్ తన ప్లాట్‌ఫాంలో చేర్చుకుంది. అలాగే  జియోఫోన్లలో ఇప్పటికే వాట్సాప్  ఇన్స్టెంట్ మెసేజ్  ఫీచర్ లాంచ్ చేసింది. 480 మిలియన్లకు పైగా వినియోగదారులతో చైనా తరువాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద డిజిటల్ మార్కెట్ ను సొంతం చేసుకున్న వాట్సాప్ ప్రధానంగా గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే వంటి కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుందని స్వయంగా ముకేశ్ అంబానీ బుధవారం నాటి సందేశంలో పేర్కొనడం గమనార్హం. కాగా ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరణ, లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఆన్‌లైన్‌ నిత్యావసర  సేవల పంపిణీ సేవలకు బాగా డిమాండ్  పెరిగింది.  దీంతో నిత్యావ‌స‌రాల ఆన్‌లైన్‌ డెలివ‌రీలో రిలయన్స్  జియోమార్ట్  ప్రవేశం  ఈ కామర్స్ వ్యాపారంలో పెద్ద సంచలనమే కానుంది.  (ఫేస్‌బుక్‌ - జియో డీల్ : జుకర్ బర్గ్ సందేశం)

మరిన్ని వార్తలు